తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు. వెల కట్టలేని బంగారు నగలు, వజ్ర వైడూర్యల ఆభరణాలున్నఅలంకార ప్రియుడు. అంతటి బంగారు స్వామి సేవలో అనునిత్యం తరిస్తున్న సుగంధ పుష్ప మాలలు ఏంటో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. పుష్పాలంకార ప్రియుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి నిర్వహించే అనేక సేవలలో పుష్పకైంకర్యం అత్యంత ప్రియమైనది. పవిత్రమైన తిరువాయ్ మొళి అనే ప్రాచీన తమిళ గ్రంథంలో పేర్కొన్నట్లు స్వామి వారికి నిత్య కైంకర్యాలలో సుగంధ వాసనలు వెదజల్లే ఎన్నో రకాల పుష్పాలు అర్చకులు వినియోగిస్తారు. ఆపాదమస్తకం వివిధ రకాల సుగంధ భరిత కుసుమాలతో సర్వాంగ సుందరంగా అలంకరించే పుష్పహారాలు ప్రధానంగా 8 రకాలు ఉన్నాయి. అందులో శిఖామణి, సాలిగ్రామ మాల, కంఠసరి,వక్షస్థల లక్ష్మి, శంఖుచక్రం కఠారిసరం,తావళములు, తిరువడి దండలున్నాయి. వీటిలో ఒక్కో దానికి ఒక్కోప్రత్యేక ఉంది.
శిఖామణిహారం: కిరీటం మీద నుంచి రెండు భుజాల మీది వరకు అలంకరింపబడే ఒకే ఒక దండ. దీనిని శిఖామణి అంటారు. ఇది ఎనిమిది మూరల అళ్లబడి ఉంటుంది.
సాలిగ్రామమాల: శ్రీవారి భుజాల నుండి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతూవున్న సాలగ్రామాల మాలలకు ఆనుకొని వేలాడదీస్తూ అలంకరింపబడే పొడవైన పూలమాలలు ఇవి. ఈ రెండుమాలలు ఒక్కొక్కటి సుమారు 4 మూరలు ఉంటాయి.
కంఠసరి మాల: ఇది రెండు భజాల మీదికి అలంకరింపబడే దండ, ఇది మూడున్నర మూరలు ఉంటుంది.
వక్షస్థల లక్ష్మి హారం: శ్రీవారి వక్షఃస్థలంలో ఉన్న శ్రీదేవి భూదేవీలకు రెండుదండలు అలంకరిస్తారు. ఈ మాలలు ఒక్కొక్కటి ఒకటిన్నర మూర ఉంటాయి.
శంఖుచక్రం దండలు: శంఖుచక్రాలకు రెండు దండలు అలంకరిస్తారు. ఇవి ఒక్కొక్కటి ఒక మూర ఉంటుంది.
కఠారిసరం హారం: శ్రీవారి బొడ్డున వున్న నందక ఖడ్గానికి అలంకరించే దండను కఠారిసరం హారం అంటారు. ఈ దండ రెండు మూరల పొడవు ఉంటుంది.
తావళములు: రెండు మోచేతుల కింద, నడుము నుండి మోకాళ్ళపై హారాలుగా, మోకాళ్ళ నుండి పాదాల వరకు జీరాడుతూ వ్రేలాడదీసే దండలను తావళములు అంటారు. ఇవి మొత్తం మూడు దండలు ఉంటాయి. ఈ మూడు మాలల్లో ఒకటి. మూడు మూరలు, రెండోది మూడున్నర మూరలు, మూడోది నాలుగు మూరలు ఉంటుంది.
తిరువడి దండలు: తిరుమలేశుడి పాదాలపై చుట్టూ అలంకరించే రెండు దండలను తిరువడి దండలు అంటారు. ఈ ఒక్కొక్క దండ ఒక్క మూర ఉంటుంది.
ఇక ప్రతి గురువారం జరిగే పూలంగి సేవలో మాత్రమే స్వామి వారి మూలమూర్తికి ఆభరణాలన్నీ తీసివేసి మాలలతో పాటు నిలువెల్ల స్వామి వారిని విశేషంగా పూలమాలలతో అలంకరిస్తారు. ఇలా శ్రీవారిని నిత్యం సుగంధ పుష్పాలతో అర్చకులు అలంకరిస్తుండగా భక్తులకు దర్శన భాగ్యం కల్గిస్తున్నారు శ్రీ వెంకటేశ్వరుడు.