మణిపూర్‌ ప్రజలకు అండగా ఉంటా.. శాంతితోనే అభివృద్ధి సాధ్యంః ప్రధాని మోదీ

మణిపూర్‌ను శాంతి, శ్రేయస్సుకు చిహ్నంగా మార్చాలని కేంద్రం ప్రయత్నిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అల్లర్లలో అట్టుడికిన మణిపూర్‌లో రెండేళ్ల తరువాత పర్యటిస్తున్న ప్రధాని మోదీకి తమ గోడును వెళ్లబోసుకున్నారు స్థానికులు. అల్లర్ల కారణంగా సర్వం కోల్పోయామని ప్రధానికి బాధితులు వివరించారు. స్కూళ్లు మూతపడడంతో విద్యకు దూరమయ్యామని చిన్నారులు ప్రధాని మోదీ ముందు కంటతడి పెట్టారు. చిన్నారుల బాధను చూసి మోదీ చలించిపోయారు. చురాచంద్‌పూర్‌లో, హింస తర్వాత నిరాశ్రయులైన ప్రజల కుటుంబాలను ప్రధాని మోదీ కలిశారు. దీనితో పాటు, ప్రధాని మణిపూర్‌కు రూ.8500 కోట్ల విలువైన ప్రాజెక్టులను బహుమతిగా ఇచ్చారు.

కుకి ప్రాబల్యం ఉన్న చురాచంద్‌పూర్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, శాంతి కోసం కేంద్రం నిరంతరం చేసిన ప్రయత్నాలు రెండు వైపులా చర్చలకు దారితీశాయని అన్నారు. ఇక్కడ హింస జరగడం దురదృష్టకరం. భారత ప్రభుత్వం మీతో ఉందని, నేను మీతో ఉన్నానని మీకు హామీ ఇస్తున్నాను” అని ప్రధాని మోదీ అన్నారు. మణిపూర్‌ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, మోదీ మీకు అండగా ఉంటాడని వాళ్లను భరోసా ఇచ్చారు. శాంతి తోనే అభివృద్ది సాధ్యమన్నారు. మణిపూర్‌ ప్రజలకు కేంద్రం అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ప్రధాని మోదీ. చురచంద్‌పూర్‌లో ప్రసంగించిన తర్వాత, ఇంఫాల్‌కు బయలుదేరారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా ప్రధానమంత్రి రూ.8,500 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.

మణిపూర్ అభివృద్ధి వేగవంతం చేయడానికి భారత ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఈ భావనతోనే ఈ రోజు మీ మధ్యకు వచ్చానన్నారు. ఇటీవల ఇదే వేదిక నుండి, సుమారు రూ 7,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించామని, ఈ ప్రాజెక్టులు మణిపూర్ ప్రజల జీవితాలను, కొండలపై నివసిస్తున్న గిరిజన సమాజాన్ని మరింత మెరుగుపరుస్తాయని ప్రధాని మోదీ అన్నారు. గతంలో ఇక్కడి గ్రామాలకు చేరుకోవడం ఎంత కష్టమో మీ అందరికీ తెలుసని ప్రధానమంత్రి అన్నారు. ఇప్పుడు వందలాది గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ కల్పించడం జరిగింది. కొండ ప్రాంతాల ప్రజలు, గిరిజన గ్రామాలు దీని వల్ల చాలా ప్రయోజనం పొందాయి. ఏన్డీయే ప్రభుత్వ హయాంలోనే మణిపూర్‌లో రైలు కనెక్టివిటీ విస్తరిస్తోంది. జిరిబామ్-ఇంఫాల్ రైల్వే లైన్ త్వరలో రాజధాని ఇంఫాల్‌ను జాతీయ రైలు నెట్‌వర్క్‌కు కలుపుతుందని ప్రధాని మోదీ తెలిపారు. పిఎం-దేవైన్ పథకం కింద, కేంద్ర ప్రభుత్వం ఐదు కొండ జిల్లాల్లో ఆధునిక ఆరోగ్య సేవలను అభివృద్ధి చేస్తోంది. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా, భారత ప్రభుత్వం పేదలకు రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్సను అందిస్తోంది. ఒక్క మణిపూర్‌లోనే, ఈ పథకం కింద 2.5 లక్షలకు పైగా రోగులు ఉచిత చికిత్స పొందారని ప్రధాని మోదీ గుర్తు చేశారు.

2023 మే నెలలో జరిగిన అల్లర్లలో దాదాపు 260 మందికి పైగా మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కుకి-మెయిటీ వర్గాల మధ్య జాతి కలహాల తరువాత, ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రాన్ని సందర్శించకపోవడంపై విమర్శిస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అంతకుముందు మణిపూర్‌లో, రాష్ట్ర ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సాంప్రదాయ నృత్యాలతో స్వాగతించారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ ప్రధాని మోదీ పర్యటనను శాంతి, శాశ్వత పురోగతి వైపు నడిపించే క్షణంగా అభివర్ణించారు.

About Kadam

Check Also

CBSE బోర్డు కొత్త రూల్స్.. 10, 12 తరగతి పరీక్షలకు 75% అటెండెన్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే!

జాతీయ విద్యా విధానం (NEP) 2020కి జవాబుదారీతనం, క్రమశిక్షణ, సరైన అమలును నిర్ధారించడానికి CBSE బోర్డు తాజాగా కీలక మార్గదర్శకాలను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *