వాహనమిత్ర పథకం.. వీరికి మాత్రమే రూ.15వేలు.. మార్గదర్శకాలు రిలీజ్..

ఏపీ వాహనమిత్ర స్కీమ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దసరా కానుకగా సీఎం చంద్రబాబు ఆటో, క్యాబ్ డ్రైవర్లకు వీటిని అందించనున్నారు. అయితే ఈ పథకం రావాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. దీనికి సంబంధించి ప్రభుత్వం గైడ్‌లైన్స్ విడుదల చేసింది. ఎవరు అర్హులు అంటే..?

ఎన్నికల్లో ఇచ్చిన హమీ మేరకు ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తుంది ఏపీ ప్రభుత్వం. ఇక ఇటీవలే ఆటో, క్యాబ్ డ్రైవర్లకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ తెలిపారు. దసరా కానుకగా రూ.15వేలు అందజేస్తామన్నారు. వాహనమిత్ర పథకం కింద ఈ నగదును వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. దీంతో డ్రైవర్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ఈ పథకానికి సంబంధించి తాజాగా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. సొంతంగా వాహనం ఉండి ఆటో, క్యాబ్ నడుపుకునేవారు ఈ పథకానికి అర్హులు. ఈ నిధులు ఇన్సూరెన్స్ , ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్, వాహన రిపేర్ వంటి ఖర్చులకు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తుంది. ఈ పథకం రావాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

అర్హతలు ఇవే

ఏపీలో జారీ చేసిన చెల్లుబాటు అయ్యే ఆటో లేదా లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వాహనం ఏపీలో రిజిస్టర్ అయి ఉండాలి. ఆటోలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకపోయినా ఈ సారికి అనుమతిస్తారు, కానీ నెలలోపు పొందాలి. అంతేకాకుండా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు లేదా రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు అనర్హులు. అయితే పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఇంటి విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి. వ్యవసాయ భూమి 10 ఎకరాల లోపు ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నివాస, వాణిజ్య నిర్మాణం ఉండకూడదు. అదేవిధంగా వాహనాలకు ఎలాంటి పెండింగ్ బకాయిలు, చలాన్లు ఉండకూడదు.

17 నుంచి దరఖాస్తులు

ఈనెల 17 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులను స్వీకరణ ప్రారంభమవుతుంది. కొత్త లబ్ధిదారులు ఈనెల 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. క్షేత్ర పరిశీలన అనంతరం ఈనెల 24 నాటికి తుది జాబితా సిద్ధమవుతుంది. అర్హులైన డ్రైవర్ల బ్యాంకు ఖాతాలకు సీఎం చంద్రబాబు నాయుడు అక్టోబర్ 1న నిధులు జమ చేస్తారు. ఈ పథకం ద్వారా అర్హులైన వేలాది మంది ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఆర్థికంగా లబ్ధి చేకూరనుంది.

About Kadam

Check Also

రాంగ్ రూట్‌లో దూసుకొచ్చిన మృత్యువు.. టిప్పర్ ఢీకొని ఏడుగురు దుర్మరణం

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును టిప్పర్‌ ఢీకొట్టిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *