తాను పార్టీ మారినా, భావజాలం మాత్రం మారలేదని బీఆర్‌ఎస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. ఖాకీ, ఖద్దర్ రెండూ తనకు సమానమని, ఏ వేదికలో ఉన్నా సరైన దిశలోనే ముందుకు సాగుతానని తెలిపారు. బహుజన వర్గాల హక్కుల కోసం పోరాటం తన జీవిత లక్ష్యమని, చివరి శ్వాస వరకు అదే దిశగా కృషి చేస్తానని చెప్పారు.
తెలంగాణ రాజకీయాల్లో కొత్త దిశగా అడుగులు వేస్తున్న మాజీ IPS అధికారి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్.. తన ప్రయాణం, తన ఆలోచనలను టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజినికాంత్ చేసిన క్రాస్ ఫైర్ ఇంటర్వ్యూలో స్పష్టంగా వెల్లడించారు. పోలీస్ ఖాకీ నుంచి రాజకీయ ఖద్దర్ దాకా తన ప్రయాణం గురించి చెబుతూ.. తాను ఎవరి చేతిలోనూ బంధీ కాలేదు, విముక్తుణ్ని అయ్యానన్నారు. కేసీఆర్, కేటీఆర్ తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు చెప్పారు. BRSలో ఎవరూ తనపై పెత్తనం చేయరని, తాను పార్టీ కోసం కాదు, బహుజన వర్గాల కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు.
రాజకీయాల్లోకి రావడమే కాకుండా, తన సిద్ధాంతాన్ని కొనసాగించడమే తన ప్రధాన లక్ష్యం అని ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. “మొదట్నుంచీ నాది బహుజన నినాదమే. నేను పార్టీ మార్చానేమో గాని భావజాలం మార్చుకోలేదు” అన్నారు. BRSలో బహుజన విధానానికి అవకాశం ఉందని, గతంలో ఈ పార్టీ కూడా అణచివేతకు వ్యతిరేకంగానే పుట్టిందని గుర్తుచేశారు. “బహుజన రాజ్యం రావాలంటే దళితులే సీఎం కావాలని లేదు” అని స్పష్టం చేస్తూ.. సమాజంలో సమానత్వమే తన లక్ష్యమన్నారు. BRSలో తనకు ఎక్కువ స్వాతంత్ర్యం ఉందని చెప్పారు. BRSతో పొత్తు పెట్టుకున్న మరుసటి రోజే రద్దు చేసుకోవాలని BSP పెద్దల నుంచి కబురు వచ్చిందని, అందుకే బయటకు వచ్చినట్లు వివరణ ఇచ్చారు.
కవితపై కేసుల గురించి మాట్లాడుతూ… ఆమెను అకారణంగా జైల్లో పెట్టారని ఆరోపించారు. జైలు జీవితంతో కవిత చాలా కుంగిపోయారని, కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండడం మంచిదని సూచించారు. కాంగ్రెస్, బీజేపీలు కవితను నడిపిస్తున్నట్లు అనిపిస్తోందని, ఆమె చెప్పిన దాంట్లో సగం మాత్రమే నిజమని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌పై ప్రవీణ్ కుమార్ ప్రశంసలు కురిపించారు. తాను చూసిన సీఎంలలో కేసీఆర్ చాలా పెద్ద విజనరీ అన్నారు. కేసీఆర్ ఎవరినీ రక్తసంబంధం ఆధారంగా చూడరని, తెలంగాణ ప్రయోజనాలే ఆయనకు ముఖ్యమని స్పష్టం చేశారు. అప్పట్లో కాన్షీరామ్, ఇప్పుడు కేసీఆర్.. ఇద్దరూ గొప్ప లీడర్లు అని చెప్పారు.
ఫోన్ ట్యాపింగ్‌పై స్పందిస్తూ.. చట్టప్రకారం దేశభద్రత కోసం ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చని చెప్పారు. SIT ఆరోపణలను ప్రూవ్ చేయలేకపోతోందని, కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ కోసం ఈ డ్రామా ఆడుతోందని విమర్శించారు. స్వేరోస్ ఇంకా యాక్టివ్‌గా ఉందని.. BRS మళ్లీ అధికారంలోకి వస్తే స్వేరోస్ కోసం వందరెట్లు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
సిర్పూర్ తనకు ప్రత్యేకమైన ప్రదేశమని, అక్కడి అణచివేతను తొలగించడమే తన ధ్యేయమన్నారు. సీఎం పదవిని ఆశించడం లేదని, పార్టీ ఇచ్చే బాధ్యతలను మాత్రమే నిర్వర్తిస్తానన్నారు. రాజకీయాలు కేవలం పదవుల కోసం కాదని, తన ప్రాణం చివరి వరకూ బహుజన వర్గాల కోసం పోరాడుతానని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.