హైదరాబాద్ లోని మలక్ పేట, నాంపల్లి వాసులకు గుడ్ న్యూ్స్.. ఇకపై ఆధార్ అప్ డేట్, నమోదు వంటి సేవల కోసం ఎక్కడికి వెళ్లే పని లేదు. పోస్టాఫీస్ స్టాఫ్ మీ స్ట్రీట్ కే వచ్చి ఆధార్ సేవలు అందిస్తారు. అంతేకాదు అప్లై చేసుకున్న చోట సెంటర్లు ఏర్పాటు చేస్తారు. మరిన్ని వివరాలు మీ కోసం..
దేశవ్యాప్తంగా ఆధార్ అప్ డేట్ అనేది పెద్ద సమస్యగా మారింది. ఆధార్ అప్ డేట్ కోసం బ్యాంకుల ముందు , ఆధార్ సెంటర్ల ముందు జనం క్యూలు కడుతున్నారు. అందుకే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూడీఐఏ).. పోస్టాఫీస్ ల ద్వారా ఆధార్ సేవలు అందించాలని నిర్ణయించింది.
వీధుల్లోనే ఆధార్ సెంటర్లు
ఇకపై మీ సేవ కేంద్రాలతో పాటు పోస్టాఫీసుల్లో కూడా ఆధార్ సంబంధిత సేవలు పొందొచ్చు. కొత్తగా ఆధార్ కార్డు నమోదు చేసుకునే వాళ్లు, అడ్రెస్, ఫొటో వంటి మార్పులు చేసుకోవాలనుకునే వాళ్లు దగ్గర్లోని పోస్టాఫీసు అధికారులను సంప్రదించొచ్చు. అయితే ఆధార్ అప్ డేట్స్ సేవలను మరింత సులభతరం చేయడానికి హైదరాబాద్ జనరల్ పోస్టాఫీస్ ఓ కొత్త విధానాన్ని అవలంభిస్తోంది. మీ వీధుల్లోనే ఆధార్ సేవలందించేలా ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే మలక్‌పేట, నాంపల్లి ప్రాంతాల్లో సేవలు మొదలుపెట్టామని జీపీవో అబిడ్స్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ ప్రసాద్ తెలిపారు.
15 రోజుల్లో సెంటర్స్ ఏర్పాటు
పోస్టాఫీస్ సిబ్బంది లోకల్ లోని కమ్యూనిటీ లేదా కాలనీలకు వచ్చి శిబిరాలు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఒకేసారి 50 నుంచి 200 మంది ఆధార్ సేవలు పొందొచ్చు. కొత్తగా ఆధార్ నమోదు లేదా ఫొటో, పేరు, థంబ్, అడ్రస్, ఫోన్ నంబర్ వంటివి అప్ డేట్ చేసుకోవచ్చు. జీపీవోకి వచ్చి దరఖాస్తు చేసుకుంటే మీరు కోరుకున్న చోట 15 రోజుల్లోగా ఆధార్ సర్వీస్ సెంటర్స్ ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్తున్నారు.