తెలంగాణ రైతులకు సరిపడా యూరియాను పది రోజుల్లోనే సరఫరా చేయాలని.. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రాను కోరారు. తెలంగాణ రైతుల అవసరాలకు సరిపడా యూరియాను వీలైనంత త్వరగా కేటాయించి, పంపిణీ అయ్యేలా చూడాలని కోరారు. ప్రస్తుతం తెలంగాణలో సాగులో ఉన్న ప్రధాన పంటలు.. వరి, మొక్కజొన్న, పత్తికి యూరియా ఎంతో అవసరమని ఈ పది, పదిహేను రోజులు అత్యంత కీలకమైనందున.. తెలంగాణ రైతుల అవసరాలకు తగ్గట్టుగా యూరియా సరఫరా చేయాలని కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శిని కోరారు.
అలాగే అంతకు ముందు నెలల్లో ఏర్పడిన యూరియా లోటును పూడ్చే విధంగా ఈ నెలలో 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని కోరారు.. సెప్టెంబర్ నెలలో ఇప్పటివరకు లక్షా 4 వేల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి సరఫరా జరిగింది.. రానున్న 10 రోజుల్లో మరో లక్ష మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయాలని కోరగా.. దేశీయ యూరియా ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేని నేపథ్యంలో.. విదేశాల నుంచి దిగుమతయ్యే యూరియాలో తెలంగాణకు అధిక ప్రాధాన్యత ఇస్తామని రజత్ కుమార్ మిశ్రా తెలిపారు.. 40 వేల మెట్రిక్ టన్నుల యూరియాను తెలంగాణకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇచ్చిన ప్రణాళిక ప్రకారం ఈ వారంలో సరఫరా అయ్యే 40 వేల మెట్రిక్ టన్నులకు ఇది అదనం అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
వివిధ పోర్టులకు ఓడల ద్వారా వచ్చిన యూరియాలో తెలంగాణకు కేటాయింపులు ఇలా..
- మంగళూరు, ఎంవీ రెక్ గ్రేస్-2700 టన్నులు
- కాకినాడ, ఎంవీ జీఎన్ రూబి-8100 టన్నులు
- కాకినాడ, ఎంవీ గ్రేస్ ఆర్మోనీ- 7800 టన్నులు
- కృష్ణపట్నం, ఎంవీ ఎన్డీవర్-13000 టన్నులు
- జైగఢ్, ఎంవీ వాడి అల్బోస్టాన్-8100 టన్నులు
Amaravati News Navyandhra First Digital News Portal