తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎట్టకేలకు నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. ఎప్పుడాని ఊరిస్తున్న ఆర్టీసీ ఉద్యోగాలకు మోక్షం కలిగిస్తూ ఉద్యోగ నోటిఫికేషన్‌ను బుధవారం (సెప్టెంబర్ 17) విడుదల చేసింది. డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,743 పోస్టులను భర్తీ చేయనున్నారు. తాజా నోటిఫికేషన్ ప్రకారం మొత్తం డ్రైవర్ పోస్టులు1000, శ్రామిక్ పోస్టులు 743 వరకు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 8, 2025వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది.
అదే నెల 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ గురించి త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో వివరణాత్మక నోటిఫికేషన్ను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది.
ఈ పోస్టుల్లో డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. ఇక శ్రామిక్ పోస్టులకైతే నిర్దిష్ట విద్యార్హతలు ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు ఖచ్చితంగా 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు రాత పరీక్ష, డ్రైవింగ్ టెస్ట్ తదితర ఆధారంగా ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇతర సమాచారాన్ని తెలుసుకోవడానికి TGSRTC అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా సందర్శించి, ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ ఉండాలని నియామక బోర్డు సూచించింది.