ప్రజలకు నూతన సంవత్సరం బంపరాఫర్ ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరో హామీ అమలుకు సన్నద్ధమవుతోంది. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందిస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఇక ఇచ్చిన మాట ప్రకారం కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేసేందుకు ఏపీ సర్కారు సిద్ధమవుతోంది. ఏపీలో కొత్త రేషన్‌కార్డుల జారీ కోసం ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. డిసెంబర్ నుంచే నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిసింది. కొత్త రేషన్‌కార్డుల కోసం డిసెంబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిసింది. డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 28 వరకూ కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించినట్లు సమాచారం.
వైసీపీ ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రేషన్ కార్డులు మంజూరు చేశారు. అయితే చాలాకాలంగా నూతన రేషన్ కార్డుల మంజూరు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో 2024 జనవరి ప్రారంభం నుంచి చాలా మంది రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు రేషన్ కార్డును కూడా ప్రామాణికంగా తీసుకుంటున్న నేపథ్యంలో కొత్తగా పెళ్లైన జంటలతో పాటుగా.. మార్పులు, చేర్పులు చేయాల్సినవారు కూడా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్తగా వచ్చే దరఖాస్తులతో పాటుగా.. వైసీపీ హయాంలో రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారిని కూడా పరిగణనలోకి తీసుకుని.. అర్హులకు రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.