తెలంగాణలో సంక్షేమ, గురుకుల పాఠశాలల్లో వరస ఫుడ్ పాయిజన్ ఘటనలు సంచలన రేకెత్తిస్తున్నాయి. ఇటీవల ఓ బాలిక మృతి చెందగా.. చాలా మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఇష్యూ ఇప్పుడు స్టేట్ లెవల్ పొలిటికల్ హీట్ రాజేస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలతో పాటు ఆందోళనల పర్వం కొనసాగుతోంది, ఈ నేపథ్యంలోనే విద్యార్థి సంఘాల ఫుడ్ పాయిజన్ ఘటనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారంటూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఆందోళనలు విద్యార్థి సంఘాలు చేపట్టాయి.
ప్రభుత్వ సంక్షేమ బడుల్లో వరస ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ.. వామపక్ష విద్యార్థి సంఘాలు డిసెంబర్ 30న అంటే శనివారం ప్రభుత్వ పాఠశాలల బంద్ కు పిలుపునిచ్చాయి. చిన్నారులు పురుగుల అన్నం తిని అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైనా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని లెఫ్ట్ స్టూడెంట్ యూనియన్లు మండిపడుతున్నాయి. విద్యార్థులు చనిపోతున్న అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని.. పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాలు,గురుకులాలు సమస్యలతో సతమతం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ముఖ్యమైన విద్యారంగానికి మంత్రి లేకుండానే ఏడాది గడిచిపోయిందని.. ప్రస్తుత సమస్యలపై సమీక్ష జరిపే తీరిక కూడా ప్రభుత్వానికి లేకుండా పోయిందని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అందుకే ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 30న ప్రభుత్వ పాఠశాలల బంద్ కు ఎస్ఎఫ్ఐ పిలుపునిస్తుందని ప్రకటించారు. తక్షణమే ముఖ్యమంత్రి విద్యాశాఖ, వసతిగృహాలు, గురుకులాలు, కెజిబివిలపై రివ్యూ చేసి, సమస్యలు పరిష్కారం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.