కాకతీయ హాస్టల్‌లో విద్యార్థి మృతిపై నిరసనగా..నిజామాబాద్‌లో ఆందోళనకు సిద్ధమయ్యాయి విద్యార్థి సంఘాలు. కాకతీయ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
నిజామాబాద్ నగరంలోని కాకతీయ స్కూల్‌లో గుడాల శివజశ్విత్ రెడ్డి(14) అనే తొమ్మిదో తరగతి విద్యార్థి శుక్రవారం(నవంబర్ 29) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. స్వల్ప అస్వస్థతకు గురైన శివజశ్విత్ రక్తపు వాంతులతో కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. అయితే తల్లిదండ్రులకు అలస్యంగా సమాచారం ఇవ్వడంతో అనుమానం వ్యక్తమైంది. దీంతో తమ కుమారుడి మరణం సహాజ మరణం కాదని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు.
తెలంగాణలో విద్యార్థుల కష్టాలపై ఇప్పటికే దుమారం చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్‌లో స్టూడెంట్ మృతి కలకలం రేపింది. నిజామాబాద్ కాకతీయ విద్యా సంస్థల హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థి జశ్వంత్ మృతిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు, బంధువులు. యాజమాన్యం నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయాడని, మూడ్రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నా.. తమకు సమాచారం ఇవ్వలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు కాకతీయ హాస్టల్‌లో విద్యార్థి మృతిపై నిరసనగా..నిజామాబాద్‌లో ఆందోళనకు సిద్ధమయ్యాయి విద్యార్థి సంఘాలు. కాకతీయ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో కాకతీయ విద్యాసంస్థల దగ్గర పోలీసుల్ని మోహరించారు. విద్యార్థి మృతిపై విద్యాశాఖ అధికారులు స్పందించారు. విచారణకు ఆదేశించారు. విద్యార్థి మృతిపై విచారణ చేపట్టిన ఎంఈవో.. స్కూల్ నిర్లక్ష్యం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామంటున్నారు.