టాలీవుడ్ ప్రముఖ నటుడు, మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ను ప్రత్యేకంగా కలిశారు. శనివారం (నవంబర్ 30) వీరిద్దరూ పలు విషయాలపై మాట్లాడుకున్నారు. ఈ విషయాన్ని మంచు విష్ణు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీతో పాటు పలు విషయాలపై మాట్లాడుకున్నారు. అనంతరం నారా లోకేశ్ తో భేటీకి సంబంధించిన విషయాలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు మంచు విష్ణు. ‘మై బ్రదర్, ఉన్నత విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను కలిశాను. ఎన్నో విషయాలపై చర్చించుకున్నాం. ఆయన పాజిటివ్ ఎనర్జీ నిజంగా అద్భుతం. మీరు మరెన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను. హర హర మహాదేవ’ అని ట్విట్టర్ లో రాసుకొచ్చాడు మంచు విష్ణు. అయితే నారా లోకేశ్ తో ఎందుకు భేట అయ్యాడో మాత్రం క్లారిటీగా చెప్పలేదు మంచు వారబ్బాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు మంచు విష్ణు హీరో, నిర్మాతగానే కాకుండా మా అసోషియేషన్ అధ్యక్షుడు కూడా. అలాగే విద్యా వేత్త కూడా. మంచు మోహన్ ప్రారంభించిన విద్యానికేతన్ విద్యాసంస్థలతో పాటు మోహన్ బాబు యూనివర్శిటీ బాధ్యతలను కూడా అతను చూసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎంబీయూ పని మీదనే నారా లోకేశ్ తో మంచు విష్ణు సమావేశమయ్యారని తెలుస్తోంది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాతో బిజీగా ఉంటున్నాడు మంచు విష్ణు. ‘మహాభారతం’ సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్ సింగ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్మెంట్స్, 24 ప్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ శివుడిగా కనిపించనున్నాడు. అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, నయన తార, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం, శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా తదితర స్టార్ నటీనటులు వివిధ పాత్రల్లో మెరవనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 25న ఇది విడుదల కానుంది.