నిజం గడప దాటేలోపు.. అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందట.. ఇది మన పెద్దలు చెప్పేమాట. వారి కాలంలో ఏ పరిస్థితిని చూసి పెద్దలు ఈ సామెత చెప్పారో తెలియదు కానీ.. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఇది కరెక్ట్‌గా సరిపోతుంది. విశాఖపట్నంలో జరిగిన ఘటనే ఇందుకు సాక్ష్యం. అసలు నిజం తెలియకముందే.. అబద్ధం ఊరంతా చుట్టి వచ్చింది. తీరా పోలీసులు అసలు వాస్తవాలు వెల్లడించిన తర్వాత.. అందరూ ఔరా అనుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..
విశాఖపట్నంలో బుధవారం జరిగిన ఓ ఘటన స్థానికంగా కలకలం రేపింది. విశాఖలో యువతిపై యాసిడ్ దాడి జరిగిందంటూ వార్తలు వచ్చాయి. అక్కయ్యపాలెం పరిధిలోని శ్రీనివాసనగర్‌లో ఓ యువతిపై యాసిడ్ దాడి జరిగిందంటూ బుధవారం మధ్యా్హ్నం వార్తలు వచ్చాయి. యువతి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో.. బైక్ మీద ఆగంతకులు వచ్చారని, ఆమెపై యాసిడ్ పోశారంటూ ప్రచారం జరిగింది. ఈ దాడిలో గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలించారని వార్తలు వచ్చాయి. అయితే యువతి గాయపడిన మాట వాస్తవమే కానీ.. దాని వెనుక ఉన్న కారణాలు ఆలస్యంగా బయటపడ్డాయి.
విశాఖపట్నం ఫోర్త్ టౌన్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. అక్కయ్యపాలెం పరిధిలోని శ్రీనివాస్‌నగర్‌లో ఓ అంగన్వాడీ టీచర్, తన స్నేహితురాలితో కలిసి ఆటో ఎక్కారు. వారిద్దరూ ఆటోలో కూర్చుని మాట్లాడుతున్న సమయంలో ఆటోలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో అంగన్వాడీ టీచర్‌కు గాయాలయ్యాయి. అయితే అంగన్వాడీ టీచర్ స్నేహితురాలు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. ఇక గాయపడిన టీచర్‌ను గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ లోపే పెట్రోల్ దాడి జరిగిందని, యాసిడ్ పోశారంటూ వార్తలు వచ్చాయి. కానీ.. తనపై ఎలాంటి దాడి జరగలేదని బాధితురాలు వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు చెప్తున్నారు.
అటోలో అగ్గిపుల్ల వెలిగించేందుకు ప్రయత్నిస్తే.. మంటలు చెలరేగినట్లు బాధితురాలు పోలీసులకు వాంగ్మూ్లం ఇచ్చినట్లు తెలిసింది. మరోవైపు అంగన్వాడీ టీచర్, ఆమె స్నేహితురాలు ఇద్దరు ఆటో ఎక్కడం అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. అగ్గిపుల్ల వెలిగించగానే మంటలు ఎలా వచ్చాయి..? ఆటోలో ముందే పెట్రోల్ బాటిల్స్ ఉంచారా? అసలు ఆ స్నేహితురాలు ఎవరు? ఘటన తర్వాత ఆమె ఎక్కడికి వెళ్లిపోయింది? ఇలా పలు ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో పోలీసులు ఉన్నారు.