ఏపీ టెన్త్ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. 2025 మార్చి 17వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమై మార్చి 31న ముగియనున్నాయి. ఈ మేరకు ఎస్సెస్సీ బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వానికి అందిచింది. ఈ సందర్భంగా ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేశారు. పదో తరగతి పరీక్ష షెడ్యూల్‌ను ఏపీ విద్యాశాఖ అమోదించిన తర్వాత షెడ్యూల్‌ను ఖరారు చేశారు. మరోవైపు ఏపీ ఇంటర్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
ఇంటర్మీడియేట్ పరీక్షల నిర్వహణ కోసం షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వ అమోదం కోసం ఇంటర్ బోర్డు పంపింది. ప్రభుత్వ అమోదం లభిస్తే 2025 మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ పదో తరగతి విద్యార్థులకు కీలక సూచనలు చేశారు. మార్చి 2025 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ ఖరారైందని, విద్యార్థులు ప్రిపేర్ అవ్వడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్లాన్ చేసుకోవాలని అన్నారు. ఈ అదనపు సమయాన్ని అధ్యయనం చేయడానికి, అద్భుతమైన ఫలితాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఇప్పటి నుంచి పరీక్షల వరకు ఉన్న విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.