షార్ట్‌ లిస్ట్ రెడీ.. సంక్రాంతికి విడుదల..! ఢిల్లీకి చేరిన తెలంగాణ కాంగ్రెస్‌ రాజకీయం

తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలలో ఆరుగురు అదృష్టవంతులు ఎవరో మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. అన్నీ కుదిరితే సంక్రాంతికి తెలంగాణ కేబినెట్‌లో కొత్త అమాత్యులు చేరబోతున్నారు. ఇందు కోసమే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఢిల్లీ పర్యటనకు వెళ్లారని చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి సహా మరో 11 మంది మంత్రులతోనే రేవంత్ సర్కార్ నడుస్తోంది. ఇంకా మరో ఆరుగురికి కేబినెట్‌లో అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ప్రతీ సారి క్యాబినెట్ విస్తరణ జరుగుతుందని బాగా ప్రచారం జరిగింది. కానీ ఇతర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్‌ హైకమాండ్ ఆదిశగా అడుగులు లేయలేదు. కొత్త యేడాదిలో సరికొత్త జోష్‌తో తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపిస్తానని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సీఎం ప్రకటనకు తగినట్టుగానే సంక్రాంతిలోపే కేబినెట్ విస్తరణ కోసం తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచిస్తోంది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్‌ హైకమాండ్ కూడా ఫోకస్‌ పెట్టింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్‌ రాజకీయం ఢిల్లీకి చేరింది. కేబినెట్‌లో కొత్త ముఖాల జాబితా షార్ట్‌ లిస్ట్ చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భ్టటి విక్రమార్క ఢిల్లీలో అధిష్టానం ముందు ఉంచారు. ఇప్పటికే రాహుల్ గాంధీని కలిసి కేబినెట్ విస్తరణపై చర్చించారు. తమ అనుచరులకు కేబినెట్‌ బెర్తులు ఇవ్వాలని అటు రేవంత్ రెడ్డి, ఇటు భట్టి విక్రమార్క పార్టీ హైకమాండ్‌కి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.. అయితే.. దీనిపై మళ్లీ రాహుల్ గాంధీతో చర్చించి ఫైనల్ గా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం..

సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో 11 మంది మంత్రులు ఉండగా ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మాత్రం ప్రాతినిధ్యం దక్కలేదు. ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం ఇంకా ఆరుగురు కొత్త వారికి కేబినెట్‌లో చోటుకి అవకాశం ఉంది. దీంతో కచ్చితంగా ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల వారికి కేబినెట్ విస్తరణలో బెర్త్ కచ్చితంగా దక్కే అవకాశం ఉంది. ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలకు మంత్రి పదవులతో పాటు మిగిలిన మరో రెండు పదవులు ఎవరికి ఏ జిల్లాకు దక్కుతాయనే ఉత్కంఠ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నెలకొంది.

అయితే.. కేబినెట్‌ విస్తరణలో మిగిలిన మంత్రి పదవుల భర్తీతో పాటు ఇప్పడు మంత్రులకు ఉన్న శాఖలు మార్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కేబినెట్ విస్తరణతో పాటు ఇప్పటికీ ఖాళీగా ఉన్న డిప్యూటీ స్పీకర్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పోస్టులను కూడా భర్తీ చేస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా సీఎం, డిప్యూటీ సీఎం ఢిల్లీ టూర్ల నేపథ్యంలో సంక్రాంతి నుంచి పూర్తి సైన్యంతో సీఎం రేవంత్ రెడ్డి పాలన పరుగులు పెట్టించనున్నారని కాంగ్రెస్‌లో జోష్‌ కనిపిస్తోంది..

About Kadam

Check Also

60 ఏళ్ల‌లో సాధించ‌లేనిది.. రెండు ద‌శాబ్ధాల్లో సాధించాం: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌

భారత అణు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గత దశాబ్ద కాలంలో 2014లో 4,780 మెగావాట్ల నుంచి 2024 నాటికి 8,081 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *