వాలంటీర్ల వ్యవస్థ వచ్చాక ఎమ్మెల్యేలు, సర్పంచ్‌లు ఇతర ప్రజా ప్రతినిధులకు విలువ లేకుండా పోయిందని వైసీపీ వీడుతున్న నేతలు ఆరోపిస్తున్నారు.
ఫ్యాన్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. సీనియర్ నేతలు పార్టీపై సీరియస్ అవుతూ సింపుల్‌గా రాజీనామా చేస్తున్నారు. అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే.. గ్రంధి శ్రీనివాస్ వైసీపీకి గుడ్‌బై చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే కొందరు ముఖ్య నేతలు వైసీపీని వీడగా, తాజాగా మరో ఇద్దరు ముఖ్యనేతలు పార్టీకి రాజీనామా చేసి షాక్ ఇచ్చారు. గురువారం ఉదయాన్నే మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత అవంతి శ్రీనివాస్ ఊహించని రీతిలో తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. పార్టీలో ఉండలేనంటూ తేల్చి చెప్పారు. పోతూ పోతూ పార్టీపై, మాజీ సీఎం వైఎస్ జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీలో నేతలు, కార్యకర్తలకు గౌరవం కొరవడిందన్నారు అవంతి శ్రీనివాస్. జగన్ ఏకపక్ష నిర్ణయాలతో పార్టీలో ప్రజాస్వామ్యం లోపించిందని ఆరోపించారు. కొత్త ప్రభుత్వంపై మొదటిరోజు నుంచే దాడికి దిగడం సరికాదన్న ఆయన, కూటమి ప్రభుత్వానికి ఏడాదైనా టైమ్ ఇవ్వాల్సిందన్నారు. ప్రస్తుతానికైతే కూటమి సర్కార్ పాలన బాగానే ఉందంటూ కితాబిచ్చారు. ఇటు వైసీపీకి రాజీనామా చేసిన భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కూడా వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కోటరీకి తాను ఎదగడం ఇష్టం లేదన్నారు. పవన్ కళ్యాణ్ పై గెలిచిన తనకు మంత్రి పదవి ఇస్తే పవన్‌ను పెద్ద నాయకుడిని చేసినట్టు అవుతుందని భావించి మంత్రి పదవి ఇవ్వలేదని గ్రంధి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్ల వ్యవస్థ వచ్చాక ఎమ్మెల్యేలు, సర్పంచ్‌లు ఇతర ప్రజా ప్రతినిధులకు విలువ లేకుండా పోయిందన్నారు. అయితే పార్టీకి రాజీనామా చేసినప్పటికీ ఏ పార్టీలో చేరుతారన్న దానిపై ఇద్దరు నేతలు క్లారిటీ ఇవ్వలేకపోయారు.