పోలవరం పనులు ఇక పరుగులు పెట్టిస్తామంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వారం వారం ప్రతి సోమవారం పోలవరం పనులను సమీక్షిస్తూ.. జెట్ స్పీడ్‌లో ప్రాజెక్ట్‌ను పూర్తిచేయాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పోలవరం పనుల్లో వేగం పెంచింది. నిర్దిష్ట కాలపరిమితితో ప్రణాళికలు రూపొందించి పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షిస్తూనే ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు ట్రెండ్ మార్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు డెడ్‌లైన్లు పెరుగుతూ పోయాయి. కానీ చంద్రబాబు ప్రాజెక్ట్ డెడ్‌లైన్ కుదించారు. అక్టోబర్ 2026 కల్లా ప్రాజెక్టును పూర్తిచేయాలని ఆదేశించారు. పనుల్లో వేగం పెంచారు.
టార్గెట్ 2026.. పోలవరం ప్రాజెక్టు గడువు కుదింపు.. బుల్లెట్ స్పీడ్‌తో ప్రాజెక్ట్ పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి అన్నారు చంద్రబాబు. ఈ ప్రాజెక్ట్ తో 7లక్షల 20వేల ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుందన్నారు. 28 లక్షల మందికి తాగునీరు అందుతుందన్నారు. కొత్తగా 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అందుబాటులోకి రానుంది.
అక్టోబర్ 2026 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రం వాల్ పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. సోమవారం(డిసెంబర్ 16) పోలవరం ప్రాజెక్టు పనులను స్వయంగా పరిశీలించారు సీఎం చంద్రబాబు. పోలవరం గ్యాప్-1 పనులను పర్యవేక్షించారు. డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను పరిశీలించిన చంద్రబాబు.. పనుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలవరం పనులు ఎంత ఆలస్యమైతే ఏపీ ప్రజలకు అంత నష్టమని, అందుకే వేగంగా ప్రాజెక్టు పనులను పూర్తిచేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
పోలవరం, అమరావతి రాష్ట్రానికి రెండు కళ్లు అని చంద్రబాబు అన్నారు. పోలవరం పూర్తిచేసి నదులను అనుసంధానం చేస్తే రాష్ట్రానికి గేమ్ ఛేంజర్ అవుతుందన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణానదికి అనుసంధానం చేశామన్నారు చంద్రబాబు. గొల్లపల్లి రిజర్వాయర్ వస్తే చాలా వరకు ఇబ్బంది ఉండదన్నారు. వెలిగొండ ఇరిగేషన్‌కు కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుందన్నారు. అక్కడి నుంచి బనకచర్లకు నీటిని తీసుకెళ్లొచ్చన్నారు. ప్రాజెక్టుకు 50లక్షల క్యూసెక్కులు డిశ్చార్జ్ చేసే సామర్థ్యం ఉందన్నారు. 93 మీటర్లు డయాఫ్రం వాల్ అత్యంత ఎత్తయిన స్పిల్ వే గేట్లు ఏర్పాటు చేస్తున్నాని సీఎం తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ తో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని చంద్రబాబు వెల్లడించారు.
2014 నుంచి 2019 వరకు రేయింబవళ్లు పనిచేశామని, ముందుజాగ్రత్త చర్యతో 2014లో సీఎం కాగానే ఏడు ముంపు మండలాలు ఇవ్వకపోతే ప్రమాణం చేయమని చెప్పాననన్నారు. ఒక్కరోజులో స్పిల్ చానల్ లో 32వేల 215 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి గిన్నిస్ రికార్డును బ్రేక్ చేశామని చంద్రబాబు తెలిపారు. ఎగువ దిగువ కాఫర్ డ్యాములు రెండూ పూర్తి చేసి, డయాఫ్రం వాల్ ను 414 రోజుల్లో పూర్తిచేయగలిగామని పేర్కొన్నారు. 2కిలోమీటర్ల పొడువుతో దాదాపు 100 మీటర్ల డయాఫ్రం వాల్‌కు శ్రీకారం చుట్టారు. ప్రతి పనిని పీపీఏ , సెంటర్ వాటర్ కమిషన్ అనుమతిస్తూ వచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 72 శాతం పనులు గతంలో తాము అధికారంలో ఉండగానే పూర్తిచేశామని తెలిపారు. 28 సార్లు క్షేత్రస్థాయి పరిశీలన చేశానని, 82 సార్లు వర్చువల్ సమీక్షలు చేశానని, సోమవారాన్ని పోలవరంగా చేసుకుని సమీక్షలు నిర్వహించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
2019లో వైసీపీ అధికారంలోకి రాగానే పోలవరం పనులు ఆగిపోయాయన్నారు చంద్రబాబు. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజక్టును సర్వనాశనం చేశారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఆగస్టు, అక్టోబర్ లో వరదలకు డయాఫ్రంవాల్ పూర్తిగా దెబ్బతిన్నదన్నారు. దాని తర్వాత పోలవరం నిర్వీర్యమైందని చంద్రబాబు అన్నారు. జగన్ అసమర్థత, అవగాహనరాహిత్యం, అవినీతి కలిపి ప్రాజెక్టును నాశనం చేశారని ముఖ్యమంత్రి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టు పనులు మళ్లీ పట్టాలెక్కాయన్నారు చంద్రబాబు. అక్టోబర్ 2026 కల్లా ప్రాజెక్టును పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల కలను సాకారం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
ఆంధ్రుల జీవనాడి.. పోలవరం ప్రాజెక్ట్.. నిర్మాణ దశను దాటలేక దశాబ్దాల తరబడి అపసోపాలు పడుతూనే ఉంది. ప్రభుత్వాలు మారినా కొత్తకొత్త సమస్యలతో నిర్మాణంలో అంతులేని జాప్యం తప్పడం లేదు. కొత్త సమస్యల్లో అతికొత్త సమస్య ఏంటంటే.. ప్రాజెక్టు దగ్గర గోదావరి లోపల నిర్మించిన డయాఫ్రం వాల్ భారీ వరదలకు దెబ్బతినడం..!
2018లో ఉభయగోదావరి జిల్లాల పరిధిలో గోదావరి నదీ గర్భంలో 93.5 మీటర్ల లోతులో నిర్మించిన డయాఫ్రమ్ వాల్ ఇది. రెండు సీజన్లలో 412 రోజుల కాల వ్యవధిలో పూర్తయినప్పటికీ 2020 తర్వాత వచ్చిన వరదల కారణంగా దెబ్బతినింది. దీంతో దీని మీద నిర్మించాల్సిన మెయిన్ డ్యామ్ పనులు ఆగిపోయాయి. ఇటీవలే మళ్లీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు కొత్త డయాఫ్రమ్ వాల్‌పై దృష్టి పెట్టారు. విదేశీ నిపుణుల సలహాలు-సూచనలతో ముందుకెళ్లాలని నిర్ణయించారు. కేంద్ర జలసంఘం సీఈ విజయ్ శరన్ అధ్యక్షతన ముగ్గురు విదేశీ నిపుణులతో పరిశీలన బృందం ఏర్పాటైంది. రాష్ట్రానికి వచ్చిన విదేశీ నిపుణుల బృందం.. పోలవరంపై మేథోమథనం చేసింది. రెండురోజుల పాటు ఎగువ-దిగువ కాపర్ డ్యామ్ నిర్మాణాలను పరిశీలించింది. దీనికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ చూసి, పోలవరం ఆధారిటీ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపింది.
గ్యాప్-2లో డయాఫ్రం వాల్ ప్లాట్‌ఫాం, వాల్ నిర్మాణానికి అవసరమైన ఓడోమీటర్లు, కొత్త వాల్ నిర్మాణం కోసం ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ కుడివైపు జరుగుతున్న మట్టి పనులు, దిగువ కాఫర్ డ్యాం వద్ద డీవాటరింగ్ పనులు.. అన్నిటినీ నిశితంగా పరిశీలించారు. ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో కేంద్ర జలసంఘం ఛైర్మన్ కూడా ఈ సంప్రదింపుల్లో పాల్గొన్నారు. అటు.. ఆఫ్రి సంస్థ సిద్ధం చేసిన కొత్త డయాఫ్రమ్ వాల్, ప్రధాన డ్యామ్ డిజైన్లపై చర్చించింది. పాత డయాఫ్రం వాల్‌కు ఎగువన 6 మీటర్ల దూరంలో కొత్త డయాప్రం వాల్ నిర్మించాలని, ఇసుక సాంద్రత పెంచి మరింత గట్టిదనం తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు. నిపుణుల భేటీ తర్వాత సీఎం చంద్రబాబు క్షేత్ర స్ధాయిలో పోలవరం పర్యటిస్తూ, పనులను వేగవంతం చేస్తున్నారు. ఇక పోలవరం పూర్తైతే ఏపీ రూపురేఖలే మారిపోతాయి. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందా… అని రాష్ట్ర విభజన జరిగిన రోజు నుంచి అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.