ప్రకాశంజిల్లా యర్రగొండపాలెం మండలం గుర్రపుశాల గ్రామంలో పదిహేను రోజుల క్రితం వరుసచోరీలు జరిగాయి. గ్రామంలో ఇళ్ళకు తాళాలు వేసి కూలిపనుల కోసం వలసలు వెళ్ళిన 12 ఇళ్ళల్లో తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. దీంతో గ్రామస్థులంతా ఉలిక్కి పడ్డారు.
అల్లుడి హోదాలో ఆ ఊరు వచ్చాడు.. పిల్లనిచ్చిన మామ ఇంట్లో సెటిలయ్యాడు.. సొంత ఊరును కాదని అత్తగారి ఊళ్ళో మకాం పెట్టడం వెనుక మర్మం తెలియక భార్య, అత్తమామలు మా మంచి అల్లుడు అంటూ తెగ మురిసిపోయారు.. ఊరంతా ఊరుమ్మడి అల్లుడిలా అతనికి మంచి, మర్యాదలు చేశారు. అయితే ఇక్కడే అతని వక్రబుద్ది బయట పడింది. ఆదరించిన ఊరికే సున్నం పూశాడు. ఏకంగా 12 ఇళ్ళకు కన్నం వేశాడు. ఒకేరోజు 12 ఇళ్ళల్లో చోరీలకు పాల్పడి ఊళ్ళో కలకలం సృష్టించాడు. ముందుగానే పక్కగా ప్లాన్ చేసుకున్నట్టున్నాడు.. ఊళ్ళోవాళ్ళంతా ఎక్కువగా కూలిపనుల కోసం ఇళ్ళకు తాళాలు వేసి వలసలు వెళుతుండటాన్ని గుర్తించి అంతా పనులకు వెళ్ళిన సమయంలో తాపీగా 12 ఇళ్ళల్లో వరుసగా తాళాలు పగుల గొట్టి అందినకాడికి దోచుకున్నాడు. ఊళ్ళో ఓకేసారి ఇన్ని ఇళ్ళల్లో చోరీ జరగడంతో పోలీసులు అప్రమత్తమై కూపీ లాగడంతో ఊరికి అల్లుడిగా వచ్చి సెటిలైన ఓ వ్యక్తి చేతివాటం వెలుగులోకి వచ్చింది.. దీంతో పిల్లనిచ్చిన కుటుంబం పరువు పోయింది. నమ్మి అందలం ఎక్కిస్తే పాతాళానికి తొక్కేశావు కదరా… అంటూ అల్లుడి దెబ్బకు అత్తమామలకు దిమ్మతిరిగిపోయింది. పోలీసులు దొంగ అల్లుడిని అరెస్ట్ చేసి దోచిన సొమ్ము అక్షరాల 6 లక్షల 67 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.
తాళాలు వేసిన ఇళ్ళే టార్గెట్..
ప్రకాశంజిల్లా యర్రగొండపాలెం మండలం గుర్రపుశాల గ్రామంలో పదిహేను రోజుల క్రితం వరుసచోరీలు జరిగాయి. గ్రామంలో ఇళ్ళకు తాళాలు వేసి కూలిపనుల కోసం వలసలు వెళ్ళిన 12 ఇళ్ళల్లో తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. దీంతో గ్రామస్థులంతా ఉలిక్కి పడ్డారు. ఎప్పుడూ లేని విధంగా గ్రామంలో ఒకేరోజు 12 ఇళ్ళల్లో చోరీలు చేసే అంత గజదొంగ ఎవరున్నారబ్బా అంటూ తెగ అందోళన పడిపోయారు. గ్రామంలో కొంత మంది కూలి పనుల కోసం కుటుంబాలతో సహా ఇళ్ళకు తాళాలు వేసి వెళ్ళారు.. ప్రకాశం జిల్లాలోని కొండేపి, హైదరాబాదు, నాగర్ కర్నూల్ వైపు వెళ్ళారు.. ఇలా వలస వెళ్ళిన ఏసోబు అనే వ్యక్తి ఇంటి తాళం పగులగొట్టి ఉండటాన్ని గ్రామస్థులు గుర్తించి ఏసోబుకు సమాచారం ఇచ్చారు. ఏసోబు గ్రామానికి తిరిగివచ్చి చూసుకుంటే తన ఇంట్లో చోరీ జరిగిందని, ఇంట్లో సొమ్ము పోయిందని తెలుసుకున్నాడు.
అంతే కాకుండా ఇళ్ళకు తాళాలు వేసి కూలి పనులకోసం వలస వెళ్ళిన మరో 11 ఇంటి తాళాలు కూడా పగలగొట్టి ఉన్నట్టు గుర్తించారు. ఈ వరుస చోరీలపై గతనెల 29వ తేదిన యర్రగొండపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో Cr.No:192/2024 U/s 331(4),305(a) BNS దొంగతనం కేసుగా నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ వరుస చోరీలను సీరియస్‌గా తీసుకున్న ప్రకాశంజిల్లా ఎస్‌పి దామోదర్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రంగంలోకి దిగిన పోలీసుల విచారణలో గ్రామానికి అల్లుడిగా వచ్చి సెటిలయిన ముండ్ల రామయ్య అనే యువకుడు ఈ చోరీలు చేసినట్టు నిర్ధారించుకున్నారు. 24 ఏళ్ళ వయస్సున్న ముండ్ల రామయ్యను అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి 6.67 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.
వ్యసనాలకు బానిసై..
యర్రగొండపాలెం మండలం కొలుకుల గ్రామానికి చెందిన 24 ఏళ్ళ వయస్సున్న ముండ్ల రామయ్య గుర్రపుశాల గ్రామానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. తన భార్య గ్రామంలోనే నివాసం ఏర్పరుచుకున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్, జూదం లాంటి వ్యసనాలకు బానిసైన రామయ్య అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని ప్లాన్ చేసుకున్నాడు. అందుకు తన ఊరుకన్నా అత్తగారి ఊరైతే బాగుంటుందని పక్కాగా స్కెచ్ వేసుకున్నాడు. నెలరోజు క్రితం గుర్రపుశాల గ్రామంలోని కొన్ని కుటుంబాలు కూలిపనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళారు.. తాను అనుకున్న విధంగా ప్లాన్ అమలు చేసి వలస వెళ్ళిన వారి కుటుంబాలకు చెందిన మొత్తం 12 ఇళ్లలో చోరీకి పాల్పడ్డాడు. ఈ వరుస చోరీలపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు రామయ్యకు అరదండాలు వేసి డబ్బులు రికవరీ చేశారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన మార్కాపురం డిఎస్‌పి నాగరాజు, యర్రగొండపాలెం సిఐ ప్రభాకర్, ఎస్‌ఐ చౌడయ్య, కానిస్టేబుళ్ళు ఖాసిం, అనిల్ కుమార్‌లను ఎస్‌పి దామోదర్ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ఇచ్చారు.