ఊహాకందని విధ్వంసం.. 20 ఏళ్ల తర్వాత కూడా గుండెల్లో ఆనాటి విపత్తు గాయాలు..!

ఇండోనేషియాలోని సుమత్రాలో 9.1-తీవ్రతతో సంభవించిన భూకంపం సునామీగా మారింది. గంటకు 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన సునామీ థాయిలాండ్, భారతదేశం, శ్రీలంకలను గంటల వ్యవధిలో తాకింది. ఇది బుల్లెట్ రైలు కంటే రెండింతలు ఎక్కువ. శ్రీలంకలో దాదాపు 35,000 మంది మరణించారు. భారతదేశంలో 16,389 మంది, థాయిలాండ్‌లో 8,345 మంది ప్రాణాలు కోల్పోయారు.

2004 డిసెంబరు 26.. నిశ్శబ్దంగా ఆరంభమైన ఒక రోజు..! ఆకాశంలో చినుకు జాడ లేకపోయినా, భూమికి ఏదో పెద్ద విపత్తు ముంచుకొస్తోందన్న సంకేతాలు.. తుపాను హెచ్చరికలు లేకుండా, ఎవరికీ ఊహాజనితంగా కూడా ఏమీ తెలియకుండా హిందూ మహాసముద్రంలో అల్లకల్లోలం మొదలైంది. ఒక్కసారిగా రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగసి, ప్రపంచాన్ని తలకిందులు చేశాయి.

సముద్రమంత అలలు

డిసెంబర్ 26, 2004న, ఇండోనేషియాలోని సుమత్రాలో 9.1-తీవ్రతతో సంభవించిన భూకంపం సునామీని ప్రేరేపించింది. ఫలితంగా అనేక దేశాలలో లక్షలాది మంది మరణించారు. ఈ భయంకర విపత్తు ప్రపంచ విపత్తు ప్రతిస్పందన వ్యూహాలను తీవ్రంగా మార్చింది. 2004 హిందూ మహాసముద్రం భూకంపం, సునామీ ఆధునిక చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రకృతి వైపరీత్యాలలో ఒకటిగా పరిగణిస్తారు. సుమత్రాలో సంభవించిన భూకంపం 1,200 కిలోమీటర్లకు పైగా విస్తరించింది. ఇప్పటివరకు నమోదు చేయని అత్యంత సుదీర్ఘమైన ఫాల్ట్‌లైన్ చీలికను ప్రారంభించింది. సునామీ 30 మీటర్ల ఎత్తులో విధ్వంసకర తరంగాలను ఉత్పత్తి చేసింది. 23,000 అణు బాంబులకు సమానమైన శక్తిని విడుదల చేసింది. ప్రారంభ తీవ్రత 8.8గా నమోదు కాగా, అమెరికా జియోలాజికల్ సర్వే తర్వాత 30 కిలోమీటర్ల లోతుతో 9.1గా నిర్ధారించింది.

ఆ రోజు ఉదయం 9:05 గంటలకు దక్షిణ భారత తీర ప్రాంతాల్లో ప్రకృతి తన ఆగ్రహాన్ని చూపింది. సగటున నాలుగు మీటర్ల ఎత్తున అలలు తీరంపై బీభత్సం సృష్టించాయి. రెప్పపాటులో 14 దేశాలు సునామీ బీభత్సాన్ని ఎదుర్కొన్నాయి. రాష్ట్రంలోని 985 కిలోమీటర్ల తీర ప్రాంతం కూడా తీవ్రంగా ప్రభావితమైంది. పలు గ్రామాలు పూర్తిగా నీటమునిగాయి. 105 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

మత్స్యకారుల చిధ్ర జీవితాలు

ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలోని మత్స్యకారుల బతుకులు నాశనమయ్యాయి. తమ పాడైన పడవలను, పోయిన బంధువులను చూసి వారి గుండెలు బరువెక్కాయి. కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు విపత్తుకు ఎక్కువగా గురయ్యాయి. ఈ మూడు జిల్లాల్లోనే 82 మరణాలు చోటుచేసుకున్నాయి. మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి తీరంలో సరదాగా వెళ్లిన పర్యాటకులు కూడా అలల ఆగ్రహానికి బలైపోయారు.

తట్టుకుని నిలబడ్డ విశాఖపట్నం..!

అంతటి విపత్తులోనూ అదృష్టవశాత్తూ విశాఖ తీరం సురక్షితంగా నిలిచింది. డాల్ఫిన్ నోస్ వలయంగా నిలిచి, అలలను ఎదుర్కొనే రక్షణ కవచంలా నిలచింది. మత్స్యకారులకు చెందిన 1,362 పడవల్లో కొన్ని పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరికొన్ని దెబ్బతిన్నాయి. ప్రభావిత గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాల కోసం పరుగులు తీశారు. కొందరు ఎత్తయిన భవనాల్లో తలదాచుకున్నారు. ఇప్పటికీ సముద్రం ఉప్పొంగితే, గంగపుత్రులు ఆ నాటి భయానక క్షణాలను గుర్తుచేసుకుని వణికిపోతారు. ప్రాణనష్టం లేకుండా ఉండడానికి గంగమ్మ తల్లి దీవెనలే కారణమని మత్స్యకారులు విశ్వసించారు. అప్పటి నుంచి ప్రతి డిసెంబరు 26న గంగమ్మ తల్లి జాతరను విశాఖలో ఘనంగా నిర్వహిస్తున్నారు.

భయానక జ్ఞాపకాలు

2004 సునామీ కారణంగా సంభవించిన విధ్వంసం 1.5 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలను నిరాశ్రయులయ్యారు. ముఖ్యంగా నాలుగు అత్యంత ప్రభావిత దేశాలు ఇండోనేషియా, శ్రీలంక, భారతదేశం, థాయ్‌లాండ్ ఉన్నాయి. వందల వేల పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రాథమిక మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. సునామీ అంటేనే తీర ప్రాంత వాసులకు ఇప్పటికీ భయానికి మరో రూపం. సహజసిద్ధంగా వచ్చిన ఆ విపత్తు వారి బతుకుల్లో ఎన్నడూ చెరగని మచ్చలు వదిలింది. 20 ఏళ్ల తర్వాత కూడా ఆ విపత్తు వారి గుండెల్లో ఆనాటి గాయాలను తిరిగి గుర్తుకు తెస్తోంది. గజగజలాడిపోయేట్టు చేస్తోంది.

About Kadam

Check Also

బైక్‌పై హెల్మెట్స్ లేకుండా చిక్కారో.. అవి కూడా వడ్డింపు.. అదీ లెక్క..

రోడ్డు ప్రమాదాల నివారణపై విజయవాడ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. హెల్మెట్‌ వాడకంపై వాహనదారులకు అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టారు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *