పోలవరం ప్రాజెక్టు డయా ఫ్రం వాల్ పనులను పరిశీలించారు మంత్రి నిమ్మల రామానాయుడు. డయా ఫ్రం వాల్ నిర్మాణ పనులుసగం పూర్తవ్వగానే, ఈసిఆర్ఎఫ్ డ్యాం పనులు కూడా మొదలుపెడతామని చెప్పారు. ఏడేళ్ళ క్రితం పోలవరం నిర్వాసితులకు 800 కోట్లు పరిహారం అందించిన చంద్రబాబే మరలా ఇప్పుడు మరో 1000 కోట్లు పరిహారం అందించారన్నారు.
పోలవరం ప్రాజెక్టు అనుకున్న షెడ్యూల్ కల్లా పూర్తి చేస్తామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. గురువారం ప్రాజెక్టు సైట్‌లో డయాఫ్రం వాల్ పనులను పరిశీలించిన నిమ్మల…. ఈ పనులు సగం పూర్తవగానే ECRF డ్యామ్ పనులు కూడా మొదలుపెడతామన్నారు. గతంలో 18 నెలలు కష్టపడి తమ హయాంలో డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తే.. జగన్ పాలనలో ఆ కష్టమంతా నాశనమైందన్నారు. ఇప్పుడు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణంతో వెయ్యి కోట్లు అదనపు భారం పడుతోందన్నారు. పోలవరం నిర్వాసితులకు 800 కోట్లుకు పైగా పరిహారం అందించిన చంద్రబాబే.. మళ్లీ మరో వెయ్యి కోట్లు నిర్వాసిత కుటుంబాలకు అందిస్తున్నారని చెప్పుకొచ్చారు. పరిహారం విషయంలో జగన్ మాటలతో గిరిజనుల్ని మోసం చేశారన్నారు.ఇప్పుడు నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూస్తేనే.. సమాంతరంగా పునరావాస కాలనీలు సైతం పూర్తి చేస్తామన్నారు.
పోలవరంలో ప్రాజెక్ట్ ప్రాంతంలో జరుగుతున్న పనుల పరోగతిపై అధికారులతో మాట్లాడారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఇప్పటికే ఒక కట్టర్‌తో డయాఫ్రం వాల్ పనులు మొదలయ్యాయని, ఈ నెలాఖరుకు రెండో కట్టర్ రంగంలోకి దిగుతుందని అధికారులు చెప్పారు. డిసెంబరు నాటికి డయాఫ్రం వాల్ పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రణాళిక ప్రకారం పనులు కొనసాగించి 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తామని నిమ్మల స్పష్టం చేశారు.