యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్‌ఈ) 2025, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) ఎగ్జామినేషన్ 2025.. ఈ రెండు నోటిఫికేషన్లు ఒకేసారి విడుదలయ్యాయి. గతేడాదితో పోల్చితే ఈ సారి పోస్టుల సంఖ్య తగ్గింది. యేటా ఈ పరీకలకు దేశ వ్యాప్తంగా లక్షలాది మంది పోటీ పడుతుంటారన్న సంగతి తెలిసిందే. ఈసారి పోస్టులు తక్కువగా ఉండటంతో పోటీ కాస్త ఎక్కువగానే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్‌ఈ) 2025 నోటిఫికేషన్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) ఎగ్జామినేషన్ 2025లను తాజాగా విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని వివిధ కేంద్ర సర్వీసులకు చెందిన దాదాపు 979 సివిల్ సర్వీసెస్ పోస్టులను ఈ ఏడాది భర్తీ చేయనున్నారు. వీటితోపాటు 150 ఐఎఫ్ఎస్ సర్వీస్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రకటన జారీ చేశారు. కాగా గతేడాది 1,056 సివిల్ సర్వీస్ ఉద్యోగాలకు ప్రకటన జారీ అయిన సంగతి తెలిసిందే. డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్ధులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్- 2025కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉంటే సరిపోతుంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్- 2025కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మాత్రం నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా నిర్దిష్ట విభాగాల్లో డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు వయసు 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీకి అభ్యర్ధులకు వయోపరిమితలో సడలింపు ఉంటుంది.
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 22, 2025వ తేదీ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 11, 2025వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం ఉంటుంది. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్‌ధులు రూ.100 చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు. ప్రిలిమ్స్, మెయిన్స్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. సివిల్ సర్వీసెస్ పోస్టులకు, ఫారెస్టు సర్వీస్‌లకు రెండింటికీ కలిపి ఒకే ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఇక మెయిన్స్ పరీక్షలు మాత్రం వేర్వేరుగా వేరే తేదీల్లో నిర్వహిస్తారు.