అయ్యో! ఎంతపని చేశావమ్మా.. అవమానంతో ఇద్దరు కూతుళ్లను చంపి మహిళ ఆత్మహత్య!

మాటిమాటికీ పోలీసులు ఇంటికి రావడం.. అనుమానం, దర్యాప్తు పేరిట భర్తను అరెస్ట్ చేయడం, ఇంట్లో సోదాలు చేయడంతో ఆ ఇల్లాలు గుండె ముక్కలైంది. సాఫీగా సాగుతున్న తమ కాపురంలో పోలీసులు నిత్యం ప్రకంపనలు సృష్టించ సాగారు. దీంతో అవమానం భరించలేక ఇద్దరు కూతుళ్లకు ఉరి వేసి, ఆ తర్వాత తానూ ఉరి కొయ్యకు వేలాడింది ఓ ఇల్లాలు..

ఇరు కుటుంబాల్లో పెద్దల్ని ఎదిరించి మతాంతర వివాహం చేసుకుందా జంట. ఇద్దరు పిల్లలతో పచ్చగా సాగుతున్న వీరి కాపురంలోకి కేసుల పేరుతో పోలీసులు చిచ్చుపెట్టారు. ఇంటిని పలుమార్లు సోదా చేయడం, భర్తను ఏవో కేసుల పేరిట స్టేషన్‌కు తీసుకెళ్లడం ఆ భార్య అవమానంగా భావించింది. దీంతో తన ఇద్దరు కుమార్తెలకు ఉరివేసి తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన ఖమ్మం జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం..

ఖమ్మం జిల్లా మధిర మండలం నిధానపురం గ్రామానికి చెందిన షేక్‌ బాజీ ఇంటర్‌ వరకూ చదివి మెకానిక్‌ పని నేర్చుకున్నాడు. సూర్యాపేటకు చెందిన మౌలిక (32) అలియాస్‌ ప్రెజాతో ఆరేళ్ల క్రితం ఫోన్‌లో పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారింది. దీంతో ఎంటెక్‌ చదువు పూర్తయ్యాక.. ఇరు కుటుంబాల్లో పెద్దలను ఎదిరించి బాజీని వివాహం చేసుకుంది. ఖమ్మంలో కాపురం పెట్టిన ఈ జంటకు మెహక్‌ (4), మెసురూల్‌ (3).. అనే ఇద్దరు కుమార్తెలు జన్మించారు. బాజీ మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో బైక్‌ దొంగతనం, చైన్‌స్నాచింగ్‌ కేసుల్లో నిందితుడిగా పేర్కొంటూ.. గతంలో పలుమార్లు పోలీసులు అతడిని అరెస్ట్ చేయగా.. విచారణ ఖైదీగా కొన్నాల్లు జైలులో ఉన్నాడు. ఐదు నెలల క్రితం సొంత ఊరిలో తల్లిదండ్రుల ఇంటి ముందు అద్దె ఇంట్లో కాపురం పెట్టాడు. ఈ క్రమంలో పాత కేసులకు సంబంధించి పోలీసులు బుధవారం సాయంత్రం బాజీని మళ్లీ స్టేషన్‌కు తీసుకెళ్లారు. గురువారం ఉదయం మరోసారి బాజీ ఇంటికి వచ్చిన పోలీసులు ఊరి జనాలందరి ముందు బాజీ ఇంటిలో సోదాలు చేశారు. బాజీ భార్యగానీ, ఆతడి తండ్రిగానీ ఖమ్మం రావాలని సూచించారు.

ఖమ్మం బయల్దేరేందుకు బాజీ తండ్రి గఫూర్‌ సిద్ధమవుతున్న క్రమంలో.. మౌలిక అద్దెకు ఉంటున్న ఇంట్లో రేకుల కడ్డీలకు ఉరివేసి ఇద్దరు కుమార్తెలను చంపింది. అనంతరం తాను కూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రోజూ తమ ఇంటికి వచ్చే పిల్లలు ఆ రోజు ఉదయం రాకపోవడంతో బాజీ తల్లి కోడలి ఇంటికి కెళ్లి చూడగా.. ముగ్గురూ ఉరికి వేలాడుతూ కనిపించడం చూసి షాకయ్యారు. పోలీసుల వేధింపుల వల్లనే మౌలిక ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్తను పోలీసులు తీసుకెళ్లడం, ఇంటిలో సోదాలు చేయడం వల్ల అవమాన భారంతో తన కోడలు ఈ దారుణానికి ఒడిగట్టిందని బాజీ తండ్రి గఫూర్‌ కన్నీరుమున్నీరుగా విలపించాడు. దీనిపై మధిర రూరల్‌ ఎస్సై లక్ష్మీభార్గవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను మధిర ప్రభుత్వ దవాఖానకు తరలించారు.

About Kadam

Check Also

ఆడపిల్లల పాలిట తోడేళ్లు.. మతి తప్పిన మదపిచ్చోళ్లు… ఒక్కోడు ఒక్కో టైపు

కామాతురాణాం నభయం నలజ్జ.. కామంతో కళ్లు మూసుకుపోయినవాడికి సిగ్గూ భయం రెండూ ఉండవు. మరి.. సమాజం పట్ల బాధ్యత ఉంటుందని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *