విజయవాడ అర్బన్ డివిజన్ 62లో ఉన్న పాకిస్థాన్ కాలనీకి భగీరథ కాలనీగా నామకరణం చేశారు అధికారులు. ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు పేరు మార్చడం జరిగిందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు మునిసిపల్ కార్పొరేషన్ చట్టంలోని నిబంధనల ప్రకారం భగీరథ కాలనీగా పేరు మార్చడం జరిగింది..
విజయవాడలో ఎన్నో ఏళ్లుగా పాకిస్థాన్ పేరుతో పిలవబడుతున్న కాలనీ పేరు ఇకపై మారిపోయింది. ఎట్టకేలకు ఆ ప్రాంత వాసుల ఆందోళనకు ప్రతిఫలం లభించింది. తాజాగా ఆధార్ చిరునామాలు సైతం మార్చారు అధికారులు. తమ కాలనీకి పాకిస్థాన్ అనే పేరు మార్చాలంటూ చాలా కాలంగా అక్కడున్న స్థానికులు అడుగుతూనే ఉన్నారు. పాకిస్తాన్ అనే పేరుతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని, ఎట్టి పరిస్థితిలో పేరు మార్చాలని ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు ఆ కాలనీ వాసుల పోరాటం ఫలించింది. ఇప్పుడు ఆ కాలనీ పేరును మార్చారు అధికారులు.
విజయవాడల కార్పొరేషన్‌లో ఉన్న 62వ డివిజన్ లో పాకిస్థాన్ పేరుతో ఒక కాలనీ ఉంది. దీన్ని కాలనీ పేనును కాస్త అధికారులు మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలోని సెక్షన్ 418 ప్రకారం మార్చేశారు. అక్కడున్న స్థానికుల ఆధార్ కార్డుల్లో అడ్రస్‌లు కూడా మారుస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 60 మంది అధార్ కార్డ్స్ లో కాలని పేరును మార్చుకున్నారు. అప్పట్లో అంటే ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న టైంలో 1971లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించింది.
ఆ తర్వాత పాకిస్థాన్ నుంచి తూర్పు పాకిస్థాన్ విడిపోయి బంగ్లాదేశ్‌గా అవతరించింది. అప్పుడు బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చాలా కుటుంబాలు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లాయి. అనేకమంది శరణార్థులు తూర్పు పాకిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చారు. నిరాశ్రయులైన ప్రజల కోసం అప్పటి భారత ప్రభుత్వం అండగా నిలిచి శరణార్థుల కోసం దేశంలోని కొన్ని ప్లేసెస్ లో ఆశ్రయం కల్పించింది. ఈ క్రమంలోనే పాకిస్థాన్ కాలనీ పేరు ఏర్పడింది. దీనిని అధికారుల చొరవతో మార్పు చేసి భగీరథ కాలని అనే కొత్త పేరు పెట్టుకున్నట్లు ప్రకటించారు.