ఏపీలో భవన నిర్మాణ అనుమతుల గైడ్లైన్స్ వచ్చేశాయ్. నిర్మాణాలకు పట్టణ ప్రాంత స్థానిక సంస్థలే అనుమతులు ఇచ్చేలా మార్గదర్శకాలను విడుదల చేయడంతో పాటు పలు కీలక విషయాలు ప్రస్తావించింది పురపాలకశాఖ. 300 చ.మీ. భూమిలో నిర్మాణాలకు యజమానులే.. ప్లాన్ ధృవీకరించి దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వడంతోపాటు.. పలు మార్గదర్శకాలను పురపాలక శాఖ జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్లో భవన నిర్మాణ అనుమతులపై చంద్రబాబు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణ ప్రాంత స్థానిక సంస్థలే ఇక నుంచి అనుమతులు ఇచ్చేలా మార్గదర్శకాలిచ్చింది. సీఆర్డీఏ మినహా అన్ని చోట్లా అనుమతుల జారీ అధికారం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధి నుంచి పట్టణ ప్రాంత స్థానిక సంస్థలకు బదిలీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేసింది.
300 చదరపు మీటర్లు మించకుండా ఉన్న ప్రాంతాల్లో నిర్మాణాలను స్వయంగా యజమానులే ప్లాన్ ధ్రువీకరించి దరఖాస్తు చేసేలా చట్టంలో మార్పులు చేశారు. స్వయంగా యజమానులు లేదా ఆర్కిటెక్టు, ఇంజనీర్లు, టౌన్ప్లానర్లు కూడా దరఖాస్తు చేసే అవకాశం కల్పిస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది.
లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్లు కూడా ఇంటి ప్లాన్ను ధ్రువీకరించి అప్లోడ్ చేసే అవకాశం కల్పించింది. బహుళ అంతస్తులు కాని నివాస భవనాలకు మాత్రమే ఈ వెసులుబాటు కల్పిస్తూ మార్గదర్శకాలు ఇచ్చింది ప్రభుత్వం.
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు గానూ భవన నిర్మాణ అనుమతులను సరళతరం చేస్తూ ఆదేశాలిచ్చారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా భవన నిర్మాణ అనుమతుల కోసం సెల్ఫ్ సర్టిఫికేషన్ ప్రక్రియను ప్రవేశపెట్టారు.
ఇక ఆన్లైన్ బిల్డింగ్ పర్మిషన్ సిస్టంలో ఎలాంటి ఉల్లంఘనలు చోటు చేసుకున్నా సంబంధిత భవన యజమానులపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది పురపాలకశాఖ..
Amaravati News Navyandhra First Digital News Portal