ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ వచ్చేది ఇంకెన్నడో.. తప్పని నిరీక్షణ!

తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్షల కన్వీనర్లతో పాటు ఆయా సెట్ల పరీక్షల తేదీలను కూడా ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. అంతేకాకుండా ఇప్పటికే ఈఏపీసెట్, పీజీఈసెట్‌లతో సహా పలు సెట్ల షెడ్యూల్‌లను కూడా ఖరారు చేసింది. అయితే అటు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఈ ప్రక్రియ ఇంకా ప్రారంభంకాకపోవడంతో విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణకు కన్వీనర్ల నియామకంలో తీవ్ర జాప్యం కొనసాగుతోంది. తెలంగాణలో కన్వీనర్ల నియామకంతోపాటు పరీక్షల షెడ్యూల్, దరఖాస్తుల స్వీకరణ తేదీలు ప్రకటించినా.. ఏపీలో మాత్రం ఇంతవరకు ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు. అక్కడ ఇంకా కన్వీనర్ల నియామకమే పూర్తి కాలేదు. ప్రవేశ పరీక్షల నిర్వహణకు సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఎంపిక చేసేందుకు స్వల్పకాలిక టెండర్లు పిలవగా.. ఈ ప్రక్రియ కూడా ఇంతవరకు పూర్తి కాలేదు. పరీక్షల నిర్వహణకు సంబంధించి ముందుగా కన్వీనర్లను నియమిస్తే.. వారు ఆయా పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాల రూపకల్పన ప్రక్రియను పూర్తి చేసుకుంటారు. దీనికి కొంత సమయం పడుతుంది. అయితే కన్వీనర్ల నియామకంలోనే జాప్యం జరిగితే ఇక ప్రశ్నపత్రాల సెటింగ్‌కు సమయం సరిపోతుందా? అనే సందేహం విద్యావేత్తలు వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే మరోవైపు కన్వీనర్లు, ప్రవేశ పరీక్షల తేదీలతో సహా అన్ని ఒకేసారి ప్రకటించాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. పరీక్షల నిర్వహణకు సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఎంపిక పూర్తి కానందున మొత్తం ప్రక్రియలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లోనూ ప్రవేశ పరీక్షలు రాస్తారు. అయితే ఇప్పటికే తెలంగాణ షెడ్యూల్‌ వచ్చినప్పటికీ.. ఏపీలో మాత్రం ఎప్పుడిస్తారో తెలియక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

దివ్యాంగులందరికీ రాత సహాయకులు.. ఆ నిబంధన ఎత్తివేసిన సుప్రీంకోర్టు

దేశ వ్యాప్తంగా నిర్వహించే వివిధ పరీక్షలకు హాజరయ్యే దివ్యాంగులందరూ రాత సహాయకులను పొందవచ్చని సుప్రీంకోర్టు ప్రకటించింది. గతంలో ప్రామాణిక 40 శాతం వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరణపత్రం పొందిన వారికి మాత్రమే రాత సహాయకులను పొందే అవకాశం ఉండేది. దీనిని పూర్తిగా తొలగిస్తున్నట్లు అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో రాత సహాయకులను కోరే అర్హత దివ్యాంగులందరికీ కల్పిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ మేరకు ఈ నిబంధనను తొలగిస్తూ జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఫిబ్రవరి 3న తీర్పు ఇచ్చింది. దీంతో ఇకపై ప్రామాణిక వైకల్యంతో సంబంధంలేకుండా పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులందరికీ రాత సహాయకులను సమకూర్చాలని కేంద్రానికి స్పష్టం చేసింది.

About Kadam

Check Also

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. ఆ పేపర్లపై హాల్‌టికెట్లు ప్రింట్‌ తీస్తే అనుమతి రద్దు: ఇంటర్‌ బోర్డు

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే కొందరు విద్యార్ధులు ఫోన్‌కే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *