ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.. వచ్చే కొద్దిరోజుల్లో అన్ని ప్రభుత్వ సర్టిఫికెట్లు.. 161 సర్వీసులు వాట్సాప్ ద్వారా ప్రజలకు అందనున్నాయి. అందుకు మెటాతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ వివరాలు ఎలా ఉన్నాయంటే..
సమీప భవిష్యత్‌లోనే ఆంధ్రప్రదేశ్ పౌరులకు భౌతిక ధృవీకరణ పత్రాల అవసరం లేకుండా, వారి స్మార్ట్‌ఫోన్ ద్వారానే అన్ని సేవలు పొందే అవకాశం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ విషయాన్ని ఐటీ, ఆర్టీజీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేని వెల్లడించారు.
డేటా అనుసంధానంపై ఆర్టీజీఎస్ సమీక్ష..
రాష్ట్రంలోని వివిధ శాఖల మధ్య డేటా అనుసంధాన ప్రక్రియను సమీక్షించేందుకు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ(ఆర్టీజీఎస్) సమీక్షించింది. ప్రధానంగా “ప్రస్తుతం ప్రభుత్వంలో ఒకే ఒక్క డేటా వనరు(Single Source of Data) లేకపోవడం వల్ల పౌరులకు సేవలు సమర్థవంతంగా అందించడంలో సమస్యలు ఎదురవుతున్నాయి” RTGS కార్యదర్శి కాటంనేని భాస్కర్ తెలిపారు. ప్రస్తుతం పౌరులు తమకు అవసరమైన ధృవీకరణ పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అయితే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లుగా, స్మార్ట్‌ఫోన్ ద్వారానే అన్ని సేవలు అందించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ఇందులో భాగంగా ఆర్టీజీఎస్ ప్రత్యేకంగా ఒక భారీ డేటా లేక్‌ను ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా అన్ని శాఖల డేటాను అనుసంధానం చేసి, పౌరులకు మరింత మెరుగైన సేవలను అందించనున్నారు.
వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలు..
పౌరులు ఇకపై తమకు అవసరమైన ధృవీకరణ పత్రాలను వాట్సాప్ ద్వారా పొందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం మెటా సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు భాస్కర్ కాటంనేని తెలిపారు. ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 161 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. రాబోయే రోజుల్లో విద్యార్హత, కుల, ఆదాయ, జనన, మరణ ధృవీకరణ పత్రాలను కూడా వాట్సాప్ ద్వారానే డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. అంతేకాకుండా, వాట్సాప్ ద్వారా చెల్లింపులు చేయడం, ప్రభుత్వానికి ఫిర్యాదులు, అర్జీలు సమర్పించడం వంటి సౌకర్యాలు కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
Amaravati News Navyandhra First Digital News Portal