పదో తరగరతి ప్రశ్నపత్రాలపై క్యూఆర్‌ కోడ్‌ ముద్రణ.. లీకులకు కళ్లెం పడేనా?

రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు సమీపిస్తున్నాయి. మరో వైపు అధికారులు కూడా పరీక్షల నిర్వహణకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈసారి పదో తరగతి పశ్నాపత్రాలు లీకేజీలకు తావులేకుండా పకడ్భందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం తొలిసారి ప్రశ్నాపత్రాలపై విద్యాశాఖ క్యూఆర్‌ కోడ్‌ ముద్రించనుంది..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మర్చి 21వ తేదీ నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని పాఠశాలల్లో విద్యార్ధులు ముమ్మరంగా ప్రిపరేషన్‌ సాగిస్తున్నారు. మరోవైపు విద్యాశాఖ ప్రశ్నపత్రాలు ఒకవేళ లీకేజీలకు తావులేకుండా పకడ్భందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా టెన్త్‌ ప్రశ్నాపత్రాలపై క్యూఆర్ కోడ్‌ను ముద్రించనున్నట్లు విద్యాశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ఒక వేళ ఏదైనా పరీక్ష కేంద్రం నుంచి ప్రశ్నాపత్రం లీకైతే వెంటనే ఏ పరీక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చాయో తెలుసుకొని చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ఇందుకోసం ప్రశ్నపత్రాలపై క్యూఆర్‌ కోడ్‌తోపాటు ప్రతి ఒక్కదాని ప్రశ్నాపత్రంపై సీరియల్‌ నంబరు కూడా ముద్రించనుంది. ఈ విషయాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు నిర్ధారించారు. ప్రభుత్వ పరీక్షల విభాగం మాత్రం ఆ వివరాలు గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తుంది. ఇప్పటికే ఇంటర్‌ హాల్‌టికెట్లు విడుదల కాగానే వారిచ్చిన మొబైల్‌ నంబర్లకు వెంటనే మెసేజ్‌ అందేలా ఇంటర్‌ బోర్డు చర్యలు తీసుకుంది. అంటే అందులోని లింక్‌ను క్లిక్‌ చేస్తే హాల్‌టికెట్‌ ప్రత్యక్షమవుతుందన్నమాట. విద్యార్థులకు కూడా వెంటనే పరీక్ష కేంద్రం వివరాలు తెలుస్తాయి. ఇదే మాదిరి పదో తరగతి విద్యార్ధులకు ఏర్పాట్లు చేయాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రభుత్వ పరీక్షల విభాగం కాలానుగుణంగా మారటం లేదన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ క్రమంలోనే స్పందించిన పరీక్షల విభాగం ఆన్‌లైన్‌లో ఫీజులు కట్టించుకుంది. అలాగే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో విద్యార్ధులకు 24 పేజీల ఆన్సర్‌ బుక్‌లెట్‌ ఇవ్వాలని కూడా నిర్ణయించింది. కాగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5.25 లక్షల మంది హాజరుకానున్నారు.

ఏదైనా కేంద్రంలో పరీక్ష పేపర్లు లీకైతే వెంటనే గుర్తించడంతోపాటు, అసలు లీకులు కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం కూడా ముఖ్యమని ప్రధానోపాధ్యాయులు సూచిస్తున్నారు. పరీక్ష ప్రారంభానికి ముందే ప్రశ్నపత్రం బయటకు వస్తే లీకైందని, పరీక్ష ప్రారంభం తర్వాత బయటకు వస్తే లీకు కాదని చెప్పడం సరికాదని, అసలు పరీక్ష ముగిసే లోపు ప్రశ్నపత్రం బయటకు రావడమే నిబంధనలకు విరుద్ధమని అంటున్నారు. ఈసారి గ్రేడింగ్‌కు బదులు మార్కుల విధానం అమలు చేయనున్న క్రమంలో తమ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించాలన్న ఉద్ధేశ్యంతో ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ఎంతకైనా తెగించవచ్చనే ఆందోళనలు సైతం వ్యక్తమవుతున్నాయి. వీటి నివారణకు సమస్యాత్మక పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం ద్వారా పర్యవేక్షించాలన్న సూచనలు వస్తున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్రలోని పది, ఇంటర్‌ బోర్డులు సమస్యాత్మక పరీక్ష కేంద్రాల వద్ద డ్రోన్ల ద్వారా పర్యవేక్షించడాన్ని గుర్తు చేస్తున్నారు.

About Kadam

Check Also

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. ఆ పేపర్లపై హాల్‌టికెట్లు ప్రింట్‌ తీస్తే అనుమతి రద్దు: ఇంటర్‌ బోర్డు

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే కొందరు విద్యార్ధులు ఫోన్‌కే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *