2024 ర్యాంకింగ్స్‌లో ఐఐటీ మద్రాస్ అగ్రస్థానంలో నిలవగా, ఐఐటీ ఢిల్లీ రెండవ స్థానంలో, ఐఐటీ బాంబే మూడవ స్థానంలో నిలిచాయి. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ఆరు ఇంజనీరింగ్ విద్యా సంస్థలు NIRF 2024 ర్యాంకింగ్స్‌లో టాప్ 100లో చోటు దక్కించుకున్నాయి. అవేంటో.. ఏయే కోర్సులు అందుబాటులో ఉన్నాయో.. ఎంతెంత ఖర్చు అవుతుందో ఇక్కడ తెలుసుకుందాం..
నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) ర్యాంకింగ్స్‌ను 2024వ సంవత్సరానికి వరుసగా తొమ్మిదవ సారి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. దేశంలోని ఉన్నత విద్యా సంస్థలను 5 ప్రధాన రంగాలలో అవగాహన ఈ ఫ్రేమ్‌వర్క్ ఎంపిక చేస్తుంది. పర్సెప్షన్ (PER), ఔట్రీచ్ – ఇన్‌క్లూజివిటీ (OI), గ్రాడ్యుయేషన్ ఔట్‌కమ్స్ (GO), రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీసెస్ (RPC), టీచింగ్-లెర్నింగ్- రీసోర్సెస్ (TLR).. వీటి ఆధారంగా ర్యాంకింగ్ నిర్ణయిస్తుంది. 2024 ర్యాంకింగ్స్‌లో ఐఐటీ మద్రాస్ అగ్రస్థానంలో నిలవగా, ఐఐటీ ఢిల్లీ రెండవ స్థానంలో, ఐఐటీ బాంబే మూడవ స్థానంలో నిలిచాయి. ఇక తెలంగాణ నుంచి ఆరు కాలేజీలు NIRF 2024 ర్యాంకింగ్స్‌లో టాప్ 100లో చోటు దక్కించుకున్నాయి.
NIRF 2024 ర్యాంకింగ్స్.. హైదరాబాద్‌లోని టాప్ 5 ఇంజనీరింగ్ కాలేజీలు ఇవే..
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT), హైదరాబాద్
ఐఐటీ హైదరాబాద్ 71.55 స్కోరుతో 8వ స్థానాన్ని దక్కించుకుంది. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇది అత్యుత్తమ ఎంపిక. ఇక్కడ డిజైన్, అప్లైడ్ సైన్సెస్, ట్రెడిషినల్ ఇంజనీరింగ్ వంటి ఆధునిక విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లను అందిస్తుంది. ఇక్కడ విద్యార్ధులు తమ అధ్యయన రంగంలో ఆనర్స్ హోదాను పొందే అవకాశం ఉంటుంది. అలాగే ప్రయోగాలు కూడా చేయవచ్చు. ఇక్కడ ప్రవేశానికి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) ఉత్తీర్ణత సాధించాలి. ఒక్కో కోర్సు పూర్తి చేయడానికి రూ.7 నుండి రూ.9 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఎంచుకున్న స్పెషలైజేషన్, కోర్సును బట్టి మొత్తం ఫీజు మారవచ్చు. ఇక్కడి టాప్ కోర్సుల్లో.. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ ముఖ్యమైనవి.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT), వరంగల్
61.72 స్కోరుతో NIT వరంగల్ NIRF 2024 ర్యాంకింగ్స్‌లో 21వ స్థానంలో నిలిచింది.ఈ సంస్థ ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ వంటి మరిన్ని రంగాలలో అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్, ఇతర ప్రోగ్రామ్‌లను అందిస్తుంది. BTech, MBA ప్రోగ్రామ్‌లు ఫేమస్. జేఈఈ ఫలితాలు, జోసా కౌన్సెలింగ్ ఆధారంగా అడ్మిషన్లు ఉంటాయి. ఇక్కడ మొత్తం ఖర్చు రూ. 4 నుండి రూ. 6 లక్షల మధ్య ఉంటుంది. అగ్ర కోర్సులలో సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉన్నాయి.
ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT), హైదరాబాద్
2024లో IIIT హైదరాబాద్ 54.29 స్కోరుతో NIRF ర్యాంకింగ్స్‌లో 47వ స్థానాన్ని దక్కించుకుంది. గచ్చిబౌలిలో ఉన్న ఈ కాలేజీ అత్యుత్తమ ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో ఒకటి. 1998లో స్థాపించబడిన IIIT హైదరాబాద్ లాభాపేక్షలేని ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (N-PPP)గా పనిచేస్తుంది. జేఈఈ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఎంచుకున్న స్పెషలైజేషన్‌ను బట్టి మొత్తం కోర్సు ఫీజు రూ.10 నుంచి రూ.18 లక్షల మధ్య ఉంటుంది. ఇక్కడి అగ్ర కోర్సులు.. బయోటెక్నాలజీ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (CSE).
హైదరాబాద్ యూనివర్సిటీ
49.30 స్కోరుతో 70వ ర్యాంకుతో హైదరాబాద్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కోర్సులను అందించే ప్రముఖ సంస్థగా నిలిచింది. ఇక్కడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్‌లోని స్కూల్స్ ఆఫ్ స్టడీ ద్వారా మొత్తం12 పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు, వివిధ రంగాలలో రెండేళ్ల మాస్టర్స్ ప్రోగ్రామ్‌లు, సైన్సెస్, సోషల్ సైన్సెస్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ ప్రోగ్రామ్‌లతో సహా అనేక రకాల ప్రోగ్రామ్‌లను అందిస్తుంది. EAMCET లేదా JEE మెయిన్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. కోర్సు వ్యవధికి మొత్తం ఖర్చు రూ. 1 లక్ష నుంచి రూ. 4 లక్షల వరకు ఉంటుంది. అగ్ర కోర్సులు.. బయోఇన్ఫర్మేటిక్స్‌లో బీటెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో బీటెక్, కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్.
JNTU హైదరాబాద్
దేశంలోని మొట్టమొదటి సాంకేతిక యూనివర్సిటీ అయిన జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (JNTU) హైదరాబాద్ NIRF 2024 ర్యాంకింగ్స్‌లో 45.78 స్కోరుతో 88వ స్థానం దక్కించుకుంది. JNTU హైదరాబాద్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ డ్యూయల్-డిగ్రీ మాస్టర్స్ డిగ్రీ కోర్సులు, BTech, BPharma, MTech, MPharma, MSc, MCA, MBA వంటి వివిధ ప్రోగ్రామ్‌లను అందిస్తుంది. గేట్, జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్, టీఎస్ ఈఎంసెట్, టీఎస్ ఈసెట్ వంటి ప్రవేశ పరీక్షల ఆధారంగా అడ్మిషన్లు ఉంటాయి. మొత్తం కోర్సుకు రూ.1 లక్ష నుంచి రూ.4 లక్షల వరకు ఉంటుంది. ఇక్కడి అగ్ర కోర్సులు.. బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఎంటెక్ ఇన్ సైబర్ ఫోరెన్సిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ.