ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో నేటినుంచి (బుధవారం-ఫిబ్రవరి 19) మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలు ఫిబ్రవరి 19 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు.. అంటే మొత్తం 11 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ వేడుకల కోసం ఆలయ యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. శ్రీశైలం ఆలయం రంగురంగుల విద్యుత్ దీపాలతో పెయింటింగ్‌లతో సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సైతం లక్షలాదిగా పాదయాత్ర చేస్తూ నల్లమల కొండలు దాటుకుని శ్రీశైలం తరలివస్తారు. శ్రీశైలం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా భక్తుల సౌకర్యార్ధం దేవస్థానం అధికారులు విసృత ఏర్పాట్లు చేస్తున్నారు. తాగునీరు, వసతి, వైద్యం, శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి ప్రత్యేక క్యూలైన్లు.. మినరల్ వాటర్ ప్లాంట్లు, ప్రసాదం తదితర ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేశారు.
ముఖ్యంగా శ్రీస్వామివారి దర్శనానికి భక్తులు ఐదురోజుల ముందు నుంచే పాదయాత్రతో శ్రీశైలం తరలివస్తారు. వారికోసం శ్రీశైలానికి 10 కిలోమీటర్లు దూరంలోని కైలాశద్వారం, భీమునికొలను, హటకేశ్వరం మెట్ల మార్గంలో వచ్చే భక్తులు సేద తీరేందుకు భారీ షెడ్లు నిర్మించారు. తాగేందుకు మంచినీటి ట్యాంకర్లను సిద్దం చేశారు. పాదయాత్రతో వచ్చే భక్తుల కోసం మట్టి రోడ్లను మరమ్మత్తులు చేసి రోడ్డుపొడువున గ్రావల్ పోసి ట్రాక్టర్లతో చదును చేయించారు. పలుసార్లు భక్తులు పాదయాత్రగా నడిచి వచ్చే బైర్లుటి, నాగులుటి వెంకటాపురం కైలాసద్వారం, భీముని కొలనను ఈవో శ్రీనివాసరావు అధికారులతో స్వయంగా వెళ్లి పర్యవేక్షించారు. శ్రీశైలం వచ్చిన భక్తులకు శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి ప్రత్యేక క్యూలైన్లు.. అలాగే చంటి బిడ్డ తల్లులకు, వయవృద్ధులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అలానే క్యూ లైన్ లో దర్శనానికి వెళ్లే భక్తులకు దేవస్థానం ఈ సంవత్సరం 300 ml వాటర్ బాటిల్ ని కూడా అందజేయనుంది. వాటితో పాటు అల్పాహారం పాలు బిస్కెట్లు అందించనున్నారు. దీంతోపాటు ఈ సంవత్సరం భక్తులకు 24 తేదీ నుంచి 27వ తేదీ వరకు ఉచితంగా లడ్డును ఇవ్వనున్నట్లు యువ శ్రీనివాసరావు తెలిపారు.
ఉత్సవాలలో రోజుకు కోటి 35 లక్షల లీటర్ల నీటిని భక్తులు కు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. టూరిస్ట్ బస్టాండు, శివదీక్ష శిబిరాలు, ఆలయ ముందు భాగంలో భక్తులు విశ్రాంతి కోసం భారీ షేడ్లు, షామియానలు ఏర్పాటు చేసారు. పలు చోట్ల వైద్య శిబిరాలు, ఆలయ పరిసరాలలో అంబులెన్స్ లు కూడా అందుబాటులో ఉంచుతామని ఆలయ ఈవో శ్రీనివాసరావు అన్నారు. ఇందులో భాగంగా భక్తుల సౌకర్యార్థం చేపట్టవలసిన పనులపై ఇప్పటికే రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి అనగాని సత్యప్రసాద్ అనిత బీసీ జనార్దన్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి బృందం పర్యటించి దేవస్థానం జిల్లా అధికారులకు సలహాలు సూచనలు చేశారు. అలానే జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ ఆది రాజ్ సింగ్ రాణా, ఆలయ ఈవో శ్రీనివాసరావు సంయుక్తంగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు.
శ్రీశైలంలో నేటినుండి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండడంతో ఈ సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సుమారు 8 లక్షల పైన 11 రోజులపాటు భక్తులు వస్తారని ఈవో శ్రీనివాసరావు అంచనా వేశారు. అందులో భాగంగా నేటి నుంచి 1 వరకు ఆర్జిత సేవలు నిలుపుదల చేసి భక్తులందరికీ శ్రీస్వామివారి అలంకార దర్శనానికి అనుమతిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు మాత్రమే రేపటి నుండి మార్చి 23 వరకు ఉచిత స్పర్శదర్శనం కల్పిస్తున్నామని అలానే మలధారణ కలిగిన శివస్వాములకు చంద్రావతీ కల్యాణ మండపం ద్వారా ప్రత్యేక దర్శన క్యూలైన్ ఏర్పాటు చేశామననారు. ముఖ్యంగా ట్రాఫిక్ అంతరాయం లేకుండా క్షేత్ర పరిధిలో పలు చోట్ల 39 ఎకరాలలో వాహనాలకు పార్కింగ్ ఏర్పాటు చేశామన్నారు. శివరాత్రికి విచ్చేసే భక్తులకు 35 లక్షల లడ్డూలు అందుబాటులో ఉంచడంతోపాటు పలుచోట్ల లడ్డు కౌంటర్లను ఏర్పాటు చేశారు.. పాతాళగంగలో గంగ మెట్ల వద్ద అలానే రాజుల సత్రం వద్ద భక్తుల స్నానానికి షవర్లను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. పార్కింగ్ ప్రదేశాల నుంచి ఆలయానికి వసతి గృహాలకు భక్తులు వెళ్ళడానికి ఇబ్బందులు లేకుండా 10 ఉచిత బస్సులను ఏర్పాటు చేశారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టం చేశామని భద్రతాపరంగా అన్ని చర్యలు తీసుకున్నామని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వివరాలు ముఖ్య కార్యక్రమాలు ఇలా..
- 19న ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం సాయంత్రం ధ్వజారోహణ
- 20వ తేదీన భృంగివాహన సేవ
- 21వ తేదీన హంసవాహనసేవ.
- 22వ తేదీన మయూరవాహనసేవ
- 23వ తేదీన రావణవాహన సేవ
- 24వ తేదీన పుష్పపల్లకీ సేవ
- 25వ తేదీన గజవాహనసేవ
26 వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా ప్రభోత్సవం నందివాహనసేవ, రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం పాగాలంకరణ, శ్రీ స్వామి అమ్మవార్ల బ్రహ్మోత్సవ కల్యాణం 27న రథోత్సవం తెప్పోత్సవం 28న యాగ పూర్ణాహుతి, ధ్వజావరోహణ మార్చి 01 అశ్వవాహనసేవ, పుష్పోత్సవం, శయనోత్సవం
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పట్టువస్త్రాల వివరాలు ఇలా..
- 19న శ్రీకాళహస్తీశ్వరస్వామివార్ల దేవస్థానం
- 20న ద్వారకా తిరుమల
- 21న ఇంద్రకీలాద్రి విజయవాడ
- 22న ఉదయం కాణిపాకం సాయంకాలం తిరుమల తిరుపతి దేవస్థానం
- 23న ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ స్వామి అమ్మవార్లకు సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.