గత రెండు మూడు నెలలుగా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హత్యలన్నీ ఆ నగరంలోనే జరిగాయి కాబట్టి. అందునా.. తెలుగు రాష్ట్రాల్లోనే హైదరాబాద్ తరువాత అతిపెద్ద నగరం అది. ఆ సిటీ పేరు.. ఓరుగల్లు. హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగరాలైతే.. వరంగల్-హన్మకొండ-కాజీపేట్ ట్రైసిటీ. తెలంగాణకు అన్‌అఫీషియల్ క్యాపిటల్‌గా చూస్తుంటారు ఈ ఏకశిలానగరాన్ని.
తెలుగు రాష్ట్రాల్లో హత్యాకాండ సిరీస్ నడుస్తోందా అనే అనుమానం వస్తోంది ఈ వరుస ఘటనలు చూసి వరుస హత్యలు, హత్యాయత్నాలు చెరగని రక్తపు మరకలు పడేలా చేస్తున్నాయి. ఓరుగల్లులో బరితెగిస్తున్న దుండగులు నడిరోడ్డుపై వీరంగం సృష్టిస్తున్నారు. కత్తులు కోలాటం చేస్తున్నాయి. ఆ హత్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా నిలుస్తున్నాయి. ఎవర్ విక్టోరియస్‌కు ఏమైంది..? నేరాల నియంత్రణలో ఎందుకలా ఢీలా పడుతున్నారు..? తాజా ఘటనలతో మరోసారి వణుకు పుట్టిస్తోంది ఓరుగల్లు రక్త చరిత్ర.
వరంగల్ నగరంలో పోలీసులంటే నేరస్తులకు భయం తగ్గిందో..? లేక నేరస్తులు యాక్టివ్ అయ్యారో.. ఏమో కానీ హత్యలు హ అత్యాయత్నాల పరంపర కొనసాగుతోంది. సామాన్య ప్రజలకు వణుకు పుట్టిస్తుంది. గత ఏడాది 35 హత్యలు..102 హత్యాయత్నం ఘటనలు జరిగినట్లు పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. 2025 సంవత్సరం లో కూడా హత్యలు.. హత్యా యత్నాల పరంపర కొనసాగుతుంది. గురువారం ఒక్కరోజే మూడు వరుస హత్యాయత్నాల ఘటనలు ఓరుగల్లు ప్రజలను ఉలిక్కిపడేలా చేశాయి.
వరంగల్ నగరంలోని వాసవి కాలనీకి చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి తన బార్య అనితపై మటన్ నరికే కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో అత్తామామ తోపాటు తన కూతురుపై కూడా అదే కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. ప్రస్తుతం వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హసన్ పర్తి మండలం మడిపల్లి గ్రామంలో మరో ఘటన జరిగింది.. పెళ్లి వేడుకలో ఇరు కుటుంబాలు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.. ఈ ఘర్షణలో కత్తి పోట్లకు గురై రమేష్, అన్వేష్, కనకయ్య అనే ముగ్గురు ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నారు.
విచారణ జరుపుతున్న క్రమం లోనే మరో దారుణ ఘటన జరిగింది. సుమంత్ రెడ్డి అనే యువ డాక్టర్‌పై హత్యా యత్నం జరిగింది. కాజీపేటలో హాస్పిటల్ నిర్వహిస్తున్న సుమంత్ రెడ్డి రాత్రి 9 తర్వాత ఆస్పత్రిలో పనులు ముగించకుని తన కారులో ఇంటికి వెళ్తున్నాడు. కాజీపేట, బట్టుపల్లి మీదుగా వరంగల్ వైపు వెళ్తున్న వైద్యుడి వాహనాన్ని అమ్మవారిపేట సమీపంలో కొందరు గుర్తు తెలియని దుండగులు అడ్డగించారు. రోడ్డుపై కారు ఆపి అతన్ని బయటకు లాగి విచక్షణ రహితంగా ఇనుపరాడ్లతో దాడి చేశారు. తీవ్ర రక్తస్రావమై, మృత్యువుతో పోరాడుతున్న వైద్యుడిని స్థానికులు ఎంజీఎం ఆస్పత్రి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం హైదారాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి కి తరలించారు. ప్రస్తుతం సుమంత్ రెడ్డి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు.
డాక్టర్ పై దాడి ఘటన వరంగల్ నగరంలో సంచలనం సృష్టించింది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. ఈ మధ్య కాలంలో వరుసగా జరిగిన కొన్ని హత్యలు సంచలనం సృష్టించాయి. గత ఏడాది డిసెంబర్ 2న జరిగిన బ్యాంక్ మేనేజర్ రాజమోహన్ హత్య ఓరుగల్లు ఉలిక్కిపడేలా చేసింది. బంగారం కోసం అతి కిరాతకంగా చంపి శవాన్ని కారులో కుక్కి రోడ్డుపై వదిలేశాడు ఉన్మాది శ్రీనివాస్. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితున్ని పోలీసులు పట్టుకున్నారు.
ఇదిలావుంటే, జనవరి 22వ తేదీన హనుమకొండ అదాలత్‌లో నడిరోడ్డుపై దారుణహత్య జరిగింది. రాజుకుమార్ అనే ఆటో డ్రైవర్ పై మరో ఆటోడ్రైవర్ కత్తితో దాడి చేశాడు. మృతుడిది కాజీపేట మండలం మడికొండ గా గుర్తించారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. వరంగల్ లోని కరీమాబాద్ లో బీహార్‌కు చెందిన వలస కూలీ దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు దిల్ కుష్ కుమార్ గా గుర్తించారు. తన భార్యను చూస్తున్నాడనే నెపంతో ఇనుపరాడ్డుతో కొట్టి చంపాడు ఓ ఉన్మాది. ఈ ఘటనలపై పోలీసులు విచారణ జరుగుతోంది.
తాజాగా బుధవారం రాత్రి భూపాలపల్లిలో జరిగిన సామాజికవేత్త రాజలింగమూర్తి హత్య సంచలనం సృష్టించింది. రాజకీయ ప్రకంపనలకు దారి తీసింది.. నలుగురు దుండగులు కాపుకాసి నడీరోడ్డు పై మట్టు బెట్టారు. అంతా చూస్తుండగానే క్షణాల వ్యవధిలో ఈ హత్య జరిగింది. భూ వివాదమే ఈ హత్యకు కారణమని భావిస్తున్న పోలీసులు అన్నికోనాల్లో దర్యాప్తు చేస్తున్నారు.. హంతకులను పట్టుకోవడానికి నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.
ఇదే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సరిగ్గా నెల రోజుల క్రితం మరో రెండు వేరువేరు హత్యలు సంచలనం సృష్టించాయి. కాటారం మండలం దేవరంపల్లి గ్రామానికి చెందిన మేరుపాక సమ్మయ్య అనే రైతును స్వంత తమ్ముడి కుటుంబమే భూవివాదాలతో గొడ్డలితో నరికి చంపారు. సమ్మయ్యతో పాటు అతని కొడుకు కంట్లో కారంకొట్టి మారణాయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనలో సమ్మయ్య చనిపోగా అతని పెద్దకొడుకు చికిత్స పొందుతున్నాడు.
కాటారం మండలం పరిధిలోని ఇప్పగూడెం గ్రామంలో మరో ఘటన జరిగింది.. బుచ్చయ్య అనే రైతుపై ఇదే గ్రామానికి చెందిన మరో కుటుంబం అతి దారుణంగా కర్రలతో దాడి చేసి హతమార్చారు.. భూ వివాదమే కారణం.. బుచ్చయ్యపై విచక్షణ రైతంగా దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల వర్షన్ ఎలా ఉన్నా.. వరంగల్ జిల్లాలో హత్యలు, కత్తుల కల్చర్ పెరిగిందన్నది నిజం. రఫ్‌గా చెప్పుకున్న ఈ ఘటనలే ఇందుకు నిదర్శనం. పోలీసుల దగ్గర కూడా ఇప్పుడు చెప్పుకున్న మర్డర్ల డేటా ఉంది. ఏ నెల, ఎక్కడ, ఎన్ని హత్యలు జరిగాయో కూడా లెక్కలున్నాయి. ఈమధ్య వరుసహత్యలు కలవరపెడుతున్నాయన్న విషయమూ పోలీసులకు తెలుసు. అయినా సరే.. క్రైమ్‌ను కంట్రోల్ చేయలేకపోతున్నారు. హత్యలను ఆపడంలో విఫలమవుతున్నారు. నిఘా వ్యవస్థలోనే ఏదో లోపం ఉందనేది కొందరి అభిప్రాయం కూడా.
అటు విశాఖలో మూడు రోజుల్లో రెండు హత్యలు వెలుగులోకి వచ్చాయి. హత్య చేసి ఆపై నిప్పు పెట్టారు దుండగులు. ఈ రెండూ వేర్వేరు చోట్ల జరిగిన ఘటనలే అయినప్పటికీ.. దాదాపుగా ఒకేలా జరిగిన మర్డర్స్..! ఆ రెండు సంఘటనల్లోనూ డెడ్‌బాడీలు సగం కాలిన స్థితిలో కనిపించడం ఇక్కడ కామన్ పాయింట్. ఒకటి భీమిలి శివారులో జరిగితే.. మరొకటి పెందుర్తి శివార్లలో జరిగింది. విశాఖ నగర శివారు కాపులుప్పాడ ప్రాంతంలోని ఓ లేఔట్‌లో బుధవారం నాడు మృతదేహం కనిపించింది. గుర్తుపట్టలేనంతగా ఉన్న ఆ మృతదేహం కేసును ఇన్వెస్టిగేట్ చేసి దంపతులను అరెస్ట్ చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్‌లో సంచలన విషయాలు బయటపడ్డాయి.
నేరేళ్లవలసకు చెందిన చిన్నారావు దంపతులు నెల క్రితం ఆనందపురం మండలం ఎల్.వి.పాలెంలో అద్దెకు దిగారు. ఆ ఇంటి దగ్గర్లోని టీస్టాల్‌కి ప్రతి మంగళవారం, ఆదివారాల్లో జ్యోతిష్యుడు అప్పన్నదొర వచ్చివెళ్తుండేవారు. ఆయన కొన్ని పూజలు చేస్తుంటాడనే విషయం తెలుసుకున్న చిన్నారావు భార్య.. తన సమస్యలు చెప్పుకుని పరిష్కరించాలని కోరింది. నాగదోషం ఉందని చెప్పి ఏవేవో పూజలు ప్రారంభించాడు. అక్కడితో సరిపెడితే బాగుండేదేమో. కాని, పూజలు చేస్తానని చెప్పి చిన్నారావు భార్యతో అసభ్యంగా ప్రవర్తించి, బలవంతంగా లోబరుచుకున్నాడు. విషయం ఎవరికైనా చెబితే తన శక్తితో కుటుంబం మొత్తాన్ని నాశనం చేస్తానని బెదిరించాడు అప్పన్నదొర. ఆ వేధింపులు పడలేక భర్తకు చెప్పుకుందీ భార్య.
తమకు ఇలా అన్యాయం జరిగిందని పోలీసులకు చెబితే న్యాయం జరిగేది. కాని, జ్యోతిష్యుడు అప్పన్నదొరను చంపాల్సిందేనని డిసైడ్ అయ్యాడు చిన్నారావు. ప్లాన్‌లో భాగంగా తన తల్లికి ఆరోగ్యం బాగాలేదు, పూజ చేయాలని అప్పన్నదొరను పిలిపించాడు. తన తల్లి ఉప్పాడలో ఉంటుందని చెప్పి, బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్లాడు. మార్గమధ్యలో గంభీరంగెడ్డ సమీపంలో ఉన్న ఒక ప్రైవేట్ లేఔట్‌లోని షెడ్డు దగ్గరకు తీసుకువెళ్లి కత్తితో పొడిచి హత్య చేశాడు. అప్పటికే.. జ్యోతిష్యుడు అప్పన్న కనిపించకపోవడంతో కుమారుడు పద్మనాభం మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. అక్కడి ఆనవాళ్లు చూసి దర్యాప్తు చేశాక.. చంపింది చిన్నారావేనని తేల్చారు పోలీసులు. మరి.. చిన్నారావు భార్యను సైతం ఎందుకు అరెస్ట్ చేశారు? ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఆమె బాధితురాలు కదా..! ఎందుకంటే.. జ్యోతిష్యుడిని చంపిన తరువాత.. మరుసటి రోజు భార్యను స్పాట్‌కు తీసుకెళ్లాడు చిన్నారావు. డెడ్‌బాడీపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. సో, ఈ కేసులో అలా భాగస్వామ్యం అయినందుకు దంపతులిద్దరినీ అరెస్ట్ చేశారు.
హమ్మయ్య కేసును ఛేదించాం అని ఊపిరిపీల్చుకునే లోపే.. విశాఖ నగరానికి మరో శివారులో మరో డెడ్ బాడీ కలకలం సృష్టించింది. అది కూడా సగం కాలిన డెడ్‌బాడీనే. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో సగం కాలిన మృతదేహం కనిపించిందనే వార్త పోలీసులను పరుగులు పెట్టించింది. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంను రప్పించి, ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. చనిపోయిన వ్యక్తికి 25 నుంచి 30 ఏళ్ల వయసు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్.. సీన్ ఆఫ్ అఫెన్స్‌ను బట్టి ఎక్కడో హత్య చేసి, పెందుర్తికి తీసుకొచ్చి తగలబెట్టారని ఓ అంచనాకొచ్చారు. ఎందుకంటే.. సంఘటన స్థలానికి సమీపంలో అర్ధరాత్రి వరకు ముత్యమాంబ జాతర మహోత్సవం జరిగింది. స్థానికులంతా సందడిగా ఆ జాతరలో పాల్గొన్నారు. తీరా ఉదయాన్నే డెడ్‌బాడీ కనిపించింది. సో, ఎక్కడో హత్య చేసి అక్కడ పడేసి ఉంటారనేది ఓ అనుమానం. నిజానికి ఈమధ్య కాలంలో విశాఖలో నేరాలు దాదాపుగా తగ్గాయి. రౌడీ షీటర్ల కదలికలు లేకుండా పోలీసులు పకడ్బందీగా ప్లాన్ ఆఫ్ యాక్షన్‌తో వెళ్తున్నారు. కాకపోతే.. గంజాయి బ్యాచ్ మాత్రం కొంత యాక్టివ్‌గా ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. విశాఖ అంతా ప్రశాంతంగా ఉందనుకున్న సమయంలో మూడు రోజుల్లో ఒకేలాంటి రెండు ఘటనలు వెలుగుచూడడంతో స్థానికులు హడలెత్తిపోతున్నారు.
క్రైమ్‌స్టోరీలో భాగంగా ఓసారి చిత్తూరు జిల్లా వెళ్దాం. అక్కడ.. అత్త చెయ్యి నరికాడో అల్లుడు. గంగవరం మండలం పెద్ద ఉగిని గ్రామంలోని యూనిస్ ఖాన్ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గ్రామపెద్దల సమక్షంలో వాళ్లిద్దరి మధ్య రాజీ చేసే ప్రయత్నం చేసింది అత్త షమీల. కాని, అల్లుడు, కూతురు మధ్య మాటమాట పెరిగి గొడవ పెద్దదైంది. కోపం అదుపు తప్పిందేమో.. భార్యపై కత్తితో దాడికి ప్రయత్నించాడు. ఆ దాడిని అడ్డుకునేందుకు చేయి అడ్డుపెట్టడంతో.. ఆ కత్తివేటుకు అత్త షమీల ఎడమచేయి తెగిపడింది.
ఓవరాల్‌గా.. తెలుగు రాష్ట్రాల్లో వరుస క్రైమ్‌స్టోరీలు రన్ అవుతున్నాయి. గ్యాప్ లేకుండా వరుసపెట్టి హత్యలు, హత్యాయత్నాలు చేసుకుంటూ వెళ్తున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు కేసులు ఛేదిస్తూ శభాష్ అనిపించుకుంటున్నా గానీ.. వాటిని నియంత్రించడంలో ఎందుకు విఫలమవుతున్నారన్నది ప్రధాన ప్రశ్న.