హైదరాబాద్‌లో పోసాని కృష్ణమురళి అరెస్ట్.. ఏపీకి తరలింపు.!

ఏపీలో మరో పొలిటికల్ వికెట్ పడింది. కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని ఏపీకి తరలించారు. పోసాని అరెస్ట్‌తో మరోసారి వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న పోసాని ఇంటికి వెళ్లి నిన్న రాత్రి నోటీసులు ఇచ్చారు. పోసానిని అరెస్ట్ చేస్తున్నట్లు.. కుటుంబ సభ్యులకు చెప్పారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి.. అదుపులోకి తీసుకున్నారు. పోసాని కృష్ణ మురళిపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోసానిపై సెక్షన్‌ 196, 353(2), 111 రెడ్‌విత్ 3(5) కింద కేసు నమోదు చేసినట్లు నోటీసుల్లో తెలిపారు. చంద్రబాబు, పవన్‌పై అనుచిత వ్యాఖ్యలతో పాటు.. కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని పోసానిపై కేసు పెట్టారు జనసేన నేత జోగినేని మణి. ఇదే కేసులో.. అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు పోసాని.

ఇవాళ ఉదయం ఓబులవారిపల్లె పీఎస్‌కు.. ఆ తర్వాత రాజంపేట కోర్టులో పోసానిని హాజరు పరుస్తారని తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీఎఫ్‌టీవీడీసీ ఛైర్మన్‌గా పనిచేసిన పోసాని తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌తోపాటు మంత్రి నారా లోకేష్‌ను అసభ్యకరంగా దూషించారని కూటమి నేతలు అంటున్నారు. వారి ఫిర్యాదుతో పోసానిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఏపీలో పలు పోలీస్‌స్టేషన్‌లలోనూ ఆయనపై కేసులు నమోదయ్యాయి. బాపట్ల, అనంతపురం, పల్నాడు జిల్లా నరసరావుపేట, చిత్తూరు జిల్లా యాదమరి, తిరుపతి జిల్లా పుత్తూరులో పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పోసాని అరెస్ట్ చేసి ఏపీకి తరలించారు.

పోసాని అరెస్ట్‌ను ఖండించారు వైసీపీ నాయకులు. కూటమి నాయకులు కావాలనే తమ వారిపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మొన్న వల్లభనేని వంశీ, నేడు పోసానిని అరెస్ట్ చేశారన్నారు. అయితే.. అరెస్టుల వెనుక రాజకీయాలు ఏమీ లేవని.. చట్టం తన పని తాను చేసుకు పోతుందని కూటమి నేతలంటున్నారు.

About Kadam

Check Also

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. ఆ పేపర్లపై హాల్‌టికెట్లు ప్రింట్‌ తీస్తే అనుమతి రద్దు: ఇంటర్‌ బోర్డు

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే కొందరు విద్యార్ధులు ఫోన్‌కే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *