ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. కేసులో కీలక సూత్రధారులుగా భావించిన వారికి నోటీసులు ఇచ్చి వరుసగా విచారణకు పిలుస్తున్నారు. ఈ క్రమంలోనే సాక్షిగా ఇవాళ విచారణకు హాజరుకావాలని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈనెల 15న సిట్ నోటీసులు జారీ చేసింది. అయితే 17వ తేదీనే సిట్ విచారణకు హాజరవుతానన్న విజయసాయి రెడ్డి..చివరి నిమిషంలో డుమ్మా కొట్టారు. ఈ రోజు విచారణకు వస్తానంటూ మరోసారి సిట్‌కి సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన సిట్ ముందు విచారణకు హాజరుకానున్నారు. మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ ..అన్నీ రాజ్ కసిరెడ్డేనని ఇంతకుముందు విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది. దీంతో విజయసాయిరెడ్డిని సాక్షిగా విచారణకు పిలిచింది సిట్.
సిట్ నోటీసులపై స్పందించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఒకరోజు ముందగానే విచారణకు హాజరవుతున్నట్టు నిన్న సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ముందే నిర్ణయించిన కార్యక్రమాలు ఉండటంతో 18న విచారణకు వచ్చేందుకు కుదరదని..కావున ఇవాళే(17వతేదీనే) విచారణకు వస్తున్నట్టు సిట్ అధికారులకు తెలిపారు. కానీ చెప్పినట్టుగా ఆయన నిన్న (17న) విచారణకు హాజరుకాలేదు. ఇవాళ విచారణకు హాజరవుతానని మరోసారి సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇవాళ సిట్ అధికారులు ఆయనను విచారించనున్నారు. సిట్ విచారణలో ఆయన ఏం చెబుతారు. ఎలాంటి సంచలన విషయాలు బయటపెడతారోననే ఉత్కంఠ నెలకొంది.
ఇదే కేసులో అటు వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డికి కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 19న విచారణకు రావాలని రాజ్ కసిరెడ్డికి నోటీసులు జారీ చేశారు సిట్ అధికారులు. అయితే విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినప్పటికీ మూడు సార్లు రాజ్ కసిరెడ్డి విచారణకు డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలో వీరు విచారణకు హాజరవుతారా.. లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
Amaravati News Navyandhra First Digital News Portal