బిగ్‌ అలర్ట్‌.. రేపటితో ముగుస్తున్న మెగా డీఎస్సీ దరఖాస్తు గడువు! మొత్తం ఎంత మంది అప్లై చేశారంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇప్పటి వరకు మొత్తం 3,03,527 దరఖాస్తులు వచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. దరఖాస్తు గడువు రేపటితో (మే 15తో) ముగియనుందని, అభ్యర్థులు చివరి వరకు వేచిచూడకుండా దరఖాస్తు చేసుకోవాలని ఓ ప్రకటనలో సూచించింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత విడుదల చేసిన తొలి నియామక నోటిఫికేషన్‌ ఇదే. కాగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఏప్రిల్ 20న విడుదల చేసిన విషయం తెలిసిందే.

రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ నడుస్తుంది. వీటిలో జిల్లా స్థాయిలో 14,088, రాష్ట్ర, జోనల్‌ స్థాయిలో 2,259 పోస్టులున్నాయి. అయితే దరఖాస్తు గడువు సమీపిస్తున్నందు వల్ల అభ్యర్ధులు తుది గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మే 15వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుండగా.. జూన్‌ 6 నుంచే ఆన్‌లైన్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోనివారు చివరి నిమిషం వరకు వేచిచూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు.

ఆన్‌లైన్‌ రాత పరీక్షలు జూన్‌ 6 నుంచి జులై 6 వరకు మొత్తం నెల రోజులపాటు జరగనున్నాయి. హాల్‌ టికెట్లను మే 30 నుంచి అందుబాటులోకి తీసుకువస్తారు. ప్రాథమిక కీ చివరి పరీక్ష తర్వాత 2వ రోజు విడుదల చేస్తారు. కీపై అభ్యంతరాలు ప్రారంభ కీ నుండి 7 రోజులలోపు తెల్పవల్సి ఉంటుంది. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన ఏడు రోజుల తర్వాత తుది కీ విడుదల చేస్తారు. ఫైనల్‌ కీ తర్వాత ఏడు రోజులకు మెరిట్‌ జాబితా విడుదల చేయనున్నారు. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

About Kadam

Check Also

రాంగ్ రూట్‌లో దూసుకొచ్చిన మృత్యువు.. టిప్పర్ ఢీకొని ఏడుగురు దుర్మరణం

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును టిప్పర్‌ ఢీకొట్టిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *