15 ఏళ్ల తర్వాత దేశంలో జన గణన జరగనుంది. దీనికి సంబంధించింది కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 1948 జనాభా లెక్కల చట్టం (1948లో 37)లోని సెక్షన్ 3 ద్వారా ఇవ్వబడిన అధికారాలను వినియోగించుకుంటూ జనగణన చేపట్టాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో రెండు విడుతల్లో జన గణన జరగనుంది. 2026 అక్టోబర్ 1 నాటికి జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్, లడఖ్ లో జన గణన ప్రక్రియ ముగియనుంది. మిగతా రాష్ట్రాల్లో 2027 మార్చి 1 నాటికి జన గణన పూర్తి కానుంది. జనగణనతో పాటే కులగణన సైతం కేంద్రం నిర్వహించనుంది..
జన గణన ఏవిధంగా జరపాలని అన్న దానిపై ఉన్నతాధికారులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే సమీక్ష జరిపారు. జనగణన కోసం మొత్తం 34 లక్షల మంది గణకులు, సూపర్వైజర్లు, 1.34 లక్షల మంది సిబ్బంది పనిచేయనున్నారు. డిజిటల్ రూపంలోనే ట్యాబ్ ల ద్వారా జనాభా లెక్కల సేకరణ కొనసాగనుంది. ప్రభుత్వం వెల్లడించే పోర్టళ్లు, యాప్లలో ప్రజలు సొంతంగానే తమ వివరాలను నమోదుచేసే వెసులుబాటు ఉండనుంది.. జన, కుల గణనలో డేటా భద్రత కోసం కేంద్ర హోంశాఖ కఠినమైన చర్యలు తీసుకుంది.. సమాచారం సేకరణ, బదిలీ, స్టోరేజీని కోసం అత్యంత కట్టుదిట్టంగా భద్రతా చర్యలను తీసుకోనుంది హోంశాఖ..
ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం.. భారత జనాభా 140 కోట్లు.. చైనా తరువాత అత్యంత అధిక జనాభా కలిగిన దేశంగా భారత్ ఉంది. 2011 లో చివరిసారి జన గణన జరిగింది. కోవిడ్ కారణం వల్ల 2021 లో జరగాల్సిన జన గణన వాయిదా పడింది. స్వతంత్ర భారత చరిత్రలో కుల ఆధారిత జన గణన జరగడం ఇదే తొలిసారి. ఈసారి జరిగే జన గణన వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లలో మార్పులు, మహిళా రిజర్వేషన్లు, డిలిమిటేషన్ నియోజవర్గాల పునర్విభజనకు ప్రామాణికంగా ఉండనుంది.
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కుల గణన చేపట్టి రిజర్వేషన్లలో మార్పులు తీసుకువచ్చింది. మరి కేంద్రం చేసే జన కుల గణన దేశంలో ఎటువంటి మార్పులు తీసుకువస్తుందో వేచి చూడాలి.