అండమాన్ అండ్ నికోబార్ సముద్రంలో గయానా తరహా చమురు నిక్షేపాలను ఉన్నాయని భారత్ కనుగొంది. సుమారు 184,440 కోట్ల లీటర్ల ముడి చమురు నిల్వలు ఉండవచ్చని భారత పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. దీని కోసం ప్రభుత్వ రంగ సంస్థలైన ఆయిల్ ఇండియా, ఓఎన్జీసీ అక్కడ చమురు, సహజవాయువు కోసం ఆ సముద్రంలో తవ్వకాలు జరుపుతున్నాయి. గయానాలో కనుగోన్నంత పెద్ద మొత్తంలోనే.. అండమాన్ ప్రాంతంలో కూడా చమురు నిక్షేపాలు ఉన్నాయని.. అవి భారతదేశ ఆర్థిక వ్యవస్థను 3.7 ట్రిలియన్ల డాలర్ల నుంచి 20 ట్రిలియన్ల డాలర్ల వరకు విస్తరించడంలో సహాయపడుతాయని హర్దీప్ సింగ్ తెలిపారు. కానీ అక్కడ చమురు నిల్వలను వెలికి తీయడం.. భారీ ఖర్చుతో కూడుకున్న పని అని ఆయన అన్నారు.
ఒక్కో బావి తవ్వడానికి దాదాపు రూ.850 కోట్లు ఖర్చవుతుందని.. గయానాలో కూడా కొత్త చమురు నిక్షేపాల కోసం 44 బావులు తవ్వాల్సి వచ్చిందని.. దానికోసం అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించారన్నారు హర్దీప్ సింగ్. అక్కడ ఒక్కో బావికి 10 కోట్ల డాలర్ల వరకు ఖర్చు చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో ఓఎన్‌జీసీ చమురు, గ్యాస్ నిక్షేపాల కోసం రూ.37,000 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో ఎక్కువ భాగం అండమాన్, నికోబార్ సముద్ర జలాల్లో బావుల తవ్వకానికి ఉపయోగించారు.
అండమాన్ సముద్రంలో దాదాపు రెండు లక్షల కోట్ల లీటర్ల చమురు నిక్షేపాలు ఉన్నాయని అంచనా వేస్తోంది కేంద్రం. ఇది సుమారు 1,160 కోట్ల బ్యారెళ్లకు సమానం. గయానాలో కూడా ఇంతే మొత్తంలో చమురు నిక్షేపాలను వెలికి తీశారు. అక్కడ హెస్ కార్పొరేషన్, చైనాకు చెందిన సీఎన్‌ఓఓసీ కంపెనీలు ఈ నిక్షేపాలను కనుగొన్నాయి. దీంతో గయానా ప్రపంచంలోనే 17వ అతిపెద్ద చమురు నిక్షేపాలు కలిగిన దేశంగా అవతరించింది.