ఆధునిక కాలంలో డిజిటల్ చెల్లింపులు విపరీతంగా పెరిగాయి. స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించి చాలా సులువుగా నగదు లావాదేవీలు నిర్వహిస్తున్నారు. రోడ్డు పక్కన ఉండే చిన్న బడ్డీ కొట్టు నుంచి ఫైవ్ స్టార్ హోటళ్ల వరకూ వీటిని అనుమతిస్తున్నాయి. గతంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు జేబులో డబ్బులు ఉంచుకునేవారు. ఇప్పుడు డబ్బులకు బదులు జేబులో స్మార్ట్ ఫోన్, బ్యాంకు ఖాతాలో డబ్బులు ఉంటే చాలు. షాపింగ్, సినిమా, భోజనం, వినోదం, ప్రయాణం.. ఇలా అన్నింటికి డిజిటల్ పేమెంట్లు చేయవచ్చు. స్మార్ట్ ఫోన్ లోని యాప్ ల ద్వారా యూపీఐ విధానంలో డబ్బును చాలా సులభంగా చెల్లించవచ్చు. ఈ నేపథ్యంలో యూపీఐ విధానంలో నగదు లావాదేవీలు చేసే వివిధ మార్గాలపై అవగాహన పెంచుకుందాం.
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ)ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఫీసీఐ) రూపొందించింది. స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించి తక్షణమే డబ్బును బదిలీ చేయడానికి వీలు కల్పించే రియల్ టైమ్ చెల్లింపు వ్యవస్థ ఇది. నేటి ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ దీని ద్వారా చెల్లింపులు జరుగుతున్నారు. కేవలం ఇతరులకు మెసేజ్ పంపినంత సులువుగా నగదు లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.
యూపీఐ విధానంలో లావాదేవీలు చేయాలనుకునే వారికి బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఉండాలి. సాధారణంగా యూపీఐ విధానాన్ని భీమ్ యాప్ లో వినియోగిస్తారు. దీన్ని ఎన్పీసీఐ డెవలప్ చేసింది. దీనితో పాటు ప్రైవేటు యాప్ లైన పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే వంటి వాటి ద్వారా లావాదేవీలు జరుపుకోవచ్చు. అయితే మీ ఫోన్ నంబర్ ను మాత్రం బ్యాంకు ఖాతాకు తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాలి. ఇంటర్నెట్ కనెక్టివీటి ఉన్న స్మార్ట్ ఫోన్, యూపీఐ ఎనేబుల్డ్ మొబైల్ యాప్, రిజిస్టర్డ్ యూపీఐ ఐడీ, యూపీఐ పిన్ సెట్ చేయడానికి చెల్లుబాటు అయ్యే డెబిట్ కార్డు చాలా అవసరం.
- యూపీఐ ద్వారా డబ్బులు చెల్లింపులు జరిపేవారు ముందుగా ఈ కింద తెలిపిన సూచనలు పాటించాలి.
- గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, భీమ్, అమెజాన్ పే తదితర యూపీఐకి అనుసంధానమైన యాప్ లను స్మార్ట్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకోవాలి.
- అనంతరం ఆ యాప్ ను ఓపెన్ చేసి, మీ మొబైల్ నంబర్ ను ఉపయోగించి వివరాలు నమోదు చేయాలి.
- అక్కడ కనిపించిన జాబితా నుంచి మీ బ్యాంకును ఎంపిక చేసుకోవాలి. తద్వారా మొబైల్ నంబర్ కు మీ ఖాతా లింక్ అవుతుంది.
- యూపీఐ ఐడీతో పాటు, యూపీఐ పిన్ ను సెట్ చేసుకోవాలి. మీ డెబిట్ కార్డు వివరాల (చివరి ఆరు అంకెలు, గడువు తేదీ)ను నమోదు చేయాలి.
యూపీఐ ఐడీ
యూపీఐ ఐడీ ద్వారా డబ్బులను ఇతరులకు పంపించవచ్చు. పిన్ నంబర్ నమోదు చేయడం ద్వారా చాలా సులువుగా బదిలీ జరుగుతుంది.
మొబైల్ నంబర్
మొబైల్ నంబర్ ను ఎంటర్ చేయడం ద్వారా డబ్బులను ఇతరులకు పంపించవచ్చు. ఉదాహరణకు మీ ఫోన్ కాంటాక్ట్ లో నంబర్ ను ఎంపిక చేసుకోవచ్చు. లేకపోతే కొత్తగా నంబర్ ఎంటర్ చేయవచ్చు. ఇలా డబ్బును చాలా సులభంగా ఇతరులకు పంపవచ్చు.
క్యూఆర్ కోడ్
స్కాన్ అండ్ పే ఫీచర్ ద్వారా డబ్బులను పంపించేందుకు కూడా అవకాశం ఉంది. గ్రహీతకు సంబంధించి క్యూాఆర్ కోడ్ ను స్కాన్ చేసి, నగదును నమోదు చేయాలి. అనంతరం యూపీఐ పిన్ ను ఎంటర్ చేస్తే చాలు.
బ్యాంకు ఖాతా, ఐఎఫ్ ఎస్ సీ
గ్రహీత బ్యాంకు ఖాతా నంబరు, ఐఎఫ్ఎస్ సీ, పేరును నమోదు చేయడం ద్వారా కూడా డబ్బును పంపించవచ్చు. లావాదేవీ పూర్తయిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది.