పని చేస్తే సరే.. ఖాళీగా ఉంటే కుదరదు..టీసీఎస్ ఉద్యోగులకు కొత్త విధానం

ఏ సంస్థ అయినా ప్రగతి పథంలో పయనించడానికి ఉద్యోగుల పనితీరు చాలా కీలకం. వారందరూ ఆ సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా విధులు నిర్వర్తించినప్పుడే ఉన్నత స్థానానికి చేరుకుంటుంది. దీని వల్ల ఆ కంపెనీతో పాటు ఉద్యోగులకు కూడా ఎంతో ప్రయోజనం కలుగుతుంది. దీనిలో భాగంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తన ఉద్యోగుల కోసం కొత్త పని విధానం తీసుకువచ్చింది. దాని ప్రకారం ప్రతి ఉద్యోగికి ఏడాదికి కనీసం 225 రోజులు క్లయింట్ ప్రాజెక్టుల్లో పనిచేయాలి. గరిష్టంగా 35 రోజులు మాత్రమే బెంచ్ (ప్రాజెక్టు లేని సమయం)లో ఉండవచ్చు. ఈ విధానం జూన్ 12 నుంచి అమల్లోకి వచ్చింది. ఉద్యోగుల ఖాళీ సమయాన్ని తగ్గించి, సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసేలా ప్రోత్సాహించడం దీని ప్రధాన ఉద్దేశం.

ది రిసోర్స్ మెనేజ్ మెంట్ గ్రూప్ (ఆర్ఎంజీ) గ్లోబల్ హెడ్ చంద్రశేఖరన్ రామ్ కుమార్ ఈ కొత్త పని విధానాన్ని రూపొందించారు. టీసీఎస్ లోని శ్రామిక శక్తి విస్తరణను ఆర్ఎంజీ పర్యవేక్షిస్తుంది. ప్రతి ప్రాజెక్టుకు ప్రతిభ కలిగిన వారిని కేటాయించేలా చూస్తుంది. ఉద్యోగులందరికీ అన్ని సమయాల్లో ప్రాజెక్టులు కేటాయిస్తుంది. కొత్త విధానం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఉద్యోగులు ఎక్కువ కాలం బెంచ్ లో ఉంటే జీతం, కెరీర్ గ్రోత్, విదేశీ అవకాశాలు తదితర వాటిపై ప్రతి కూల ప్రభావం పడుతుందన్నారు.

కొత్త నిబంధనల ప్రకారం ప్రాజెక్టు లేని ఉద్యోగులు తమకు తాముగా పని వెతుక్కోవాలి. అంటే బెంచ్ లో ఉన్న ఉద్యోగి తమ యూనిట్ లేదా, రీజినల్ ఆర్ఎంజీని సంప్రదించాలి. సంస్థ అందించే అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. తద్వారా తమ నైపుణ్యాలను పెంచుకునేందుకు చర్యలు తీసుకోవాలి. బెంచ్ లో ఉండే ఉద్యోగులు రోజుకు 4 నుంచి 6 గంటల పాటు టీసీఎస్ ఐఇవాల్వ్ (iEvolve), ఫ్రోస్కో ప్లే (Fresco play), వీఎల్ఎస్ వంటి అంతర్గత ప్లాట్ ఫాంలతో పాటు, లింక్డ్ ఇన్ వంటి బయట వాటిని నేర్చుకోవాలి. ఆర్ఎంజీ సిఫారసు చేసిన విధంగా వ్యక్తిగత సెషన్లకు హాజరుకావాలి.

టీసీఎస్ లో పనిచేసే ఉద్యోగులందరూ తప్పనిసరిగా ఆఫీసుకు రావాలని నిబంధనలు చెబుతున్నాయి. వారందరూ ఆఫీసు నుంచి పని చేయాల్సి ఉంటుంది. వర్క్ ఫ్రం హోమ్, ఫ్లెక్సిబుల్ పని ఏర్పాట్లకు అనుమతి ఇవ్వరు. అయితే అత్యవసర సమయలో ఆర్ఎంజీ అనుమతితో తాత్కాలికంగా ఫ్లెక్సిబుల్ పని చేసేలా అవకాశం కల్పిస్తారు. అలాగే ఉద్యోగులు షార్ట్ టర్మ్ ప్రాజెక్టులో ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. తరచూ ఇలాంటి వాటిలో పనిచేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

About Kadam

Check Also

ఉపాధి హామీలో ఇకపై అలా నడవదు.. రెండు సార్లు ఫొటో దిగితేనే కూలీలకు డబ్బులు..

ఉపాధి హామీ పథకం.. ఎంతో మంది నిరుపేద గ్రామస్థులకు ఈ పథకం ఒక వరం. గ్రామాల్లో సరిగ్గా పని లేనివారిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *