మన శరీరంలో ముఖ్యమైన భాగాల్లో లివర్ ఒకటి. కానీ దురదృష్టవశాత్తు చాలా మంది దీన్ని పట్టించుకోరు. లివర్ కు నష్టం కలిగించే కారణం మద్యం మాత్రమే అని చాలా మంది అనుకుంటారు. కానీ నిజానికి మద్యం తీసుకోకపోయినా కూడా చాలా అలవాట్లు మనకు లివర్ సమస్యలు తెచ్చిపెట్టవచ్చు.
తల నొప్పి తగ్గించుకోవడానికోసం తరచూ మందులు వాడే అలవాటు చాలా మందికి ఉంది. అయితే ఎక్కువగా పెయిన్ కిల్లర్లు లేదా ఇతర మందులు వాడటం వల్ల లివర్ పై ఒత్తిడి పడుతుంది. ఇది కొంత కాలానికి లివర్ పనితీరును దెబ్బతీసే అవకాశం ఉంది. ఎక్కువగా వాడే ప్రాసెస్డ్ ఫుడ్ లు, వేయించినవి తినడం వల్ల కొవ్వు పదార్థాలు లివర్ లో పేరుకుపోతాయి. దీని వల్ల నెమ్మదిగా ఫ్యాటీ లివర్ సమస్యలు మొదలవుతాయి. వీటిని తరచూ తీసుకుంటూ ఉంటే లివర్ పనితీరు మందగిస్తుంది.
రోజు తక్కువగా నిద్రపోయే వారి శరీరంలో హార్మోన్ల సమతుల్యం దెబ్బతిని లివర్ పనితీరు బలహీనంగా మారే అవకాశం ఉంది. సరిగ్గా నిద్ర లేకపోతే శరీరంలోని ఇతర అవయవాలు కూడా సరిగా పనిచేయలేవు. అందుకే నిద్రలేమి లివర్ కు కూడా హానికరం.
ఈ రోజుల్లో చాలా మంది సరిగా తినడం లేదు. కొన్ని గంటలపాటు ఆకలిని పట్టించుకోకపోవడం లేదా రాత్రిళ్లు ఆలస్యంగా తినడం లివర్ పై ప్రభావం చూపవచ్చు. సమయానికి తింటే శరీరం శక్తివంతంగా పనిచేస్తుంది.
ఒక సాధారణ విషయం అయినా చాలా మందికి అలవాటు కానిది.. తగినంత నీరు తాగడం. రోజూ సరిపడా నీరు తాగకపోతే శరీరంలోని విష పదార్థాలు బయటకు వెళ్లవు. లివర్ కు సహాయపడే ముఖ్యమైన ప్రక్రియ.. డిటాక్సిఫికేషన్ నీటి ద్వారా బాగా జరుగుతుంది.
సాధారణంగా మనం తినే స్వీట్లలో, బేకరీ ఐటమ్స్ లలో ఎక్కువగా చక్కెర ఉంటుంది. ఎక్కువ చక్కెర లివర్ లో కొవ్వుగా పేరుకుపోతుంది. ఎక్కువ కాలం ఇలా జరిగితే ఫ్యాటీ లివర్ లాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఎక్కువ చక్కెర కలిగిన ఆహారం నుండి మనం దూరంగా ఉండాలి.
రోజువారీ జీవితంలో వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడిని నియంత్రించుకోకపోవడం, సరిగా తినకపోవడం.. ఇవన్నీ కలిసి లివర్ పై చెడు ప్రభావం చూపుతాయి. క్రమబద్ధమైన జీవనశైలిని పాటిస్తే లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.
లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కేవలం మద్యం దూరంగా పెట్టడం సరిపోదు. ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరచుకోవడం, సమయానికి తినడం, సరిపడా నిద్రపోవడం, తగినంత నీరు తాగడం లాంటి చిన్న విషయాలు కూడా లివర్ ను ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇవి పాటిస్తే లివర్ తో పాటు మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.