ప్రైవేట్ స్కూల్స్ తెలుసు..ప్రైవేటు హస్పిటల్స్ కూడా తెలుసు..ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ప్రజలకు సేవలందిస్తున్నాయి. ఇలా అనేక రంగాలు ప్రైవేటు పరంగా పనిచేస్తున్నాయి. కానీ, మీరు ఎప్పుడైనా ప్రైవేట్ రైల్వే స్టేషన్‌ను చూశారా..? అవును మీరు విన్నది నిజమే.. ఈ రైల్వే స్టేషన్ ను చూస్తే మీరు షాక్ అవుతారు.. ఎందుకంటే.. ఇది రైల్వే స్టేషనా లేకా వరల్డ్ క్లాస్ విమానాశ్రయమా అనుకునేలా ఉంటుంది..అంతేకాదు.. ఈ స్టేషన్ పర్యావరణ అనుకూల పద్ధతులకు అనుగుణంగా ఉంటుందని గుర్తించి ASSOCHAM నుండి GEM సస్టైనబిలిటీ సర్టిఫికేషన్‌లో 5-స్టార్ రేటింగ్‌ను పొందింది. ఇంతకీ ఈ ప్రైవేట్ రైల్వే స్టేషన్ ఎక్కడుందో తెలుసుకోవాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే…
ప్రైవేట్ రైల్వే స్టేషన్ ఎక్కడో కాదండోయ్ మన భారతదేశంలోనే ఉంది. భోపాల్‌లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ మన దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి PPP మోడల్‌లో జరిగింది. ఈ స్టేషన్‌ను జర్మనీలోని హైడెల్‌బర్గ్ రైల్వే స్టేషన్ నమూనాలో అభివృద్ధి చేశారు. పూర్తిగా అంతర్జాతీయ ప్రమాణాలతో అందుబాటులోకి తెచ్చారు. పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ మోడ్ లో నిర్మితమైన దేశంలోని మొట్టమొదటి రైల్వే స్టేషన్ అయిన రాణి కమలపతి ష్టేషన్ దేశంలోని ఇతర రైల్వే స్టేషన్లకు బెంచ్‌మార్క్ గా నిలుస్తోంది. ప్రయాణీకులకు ఇదో మంచి అనుభవాన్ని అందించనుంది.
రాజధాని ఎక్స్‌ప్రెస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్, దురంతో ఎక్స్‌ప్రెస్, వందే భారత్ ఎక్స్‌ప్రెస్, గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్, తేజస్ ఎక్స్‌ప్రెస్ ఈ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటాయి. రాణి కమలాపతి స్టేషన్ డిజైన్ అత్యాధునికంగా ఉంటుంది. ఈ స్టేషన్‌లో కవర్డ్ పార్కింగ్ ప్రాంతం ఉంటుంది. తద్వారా రైళ్లు రావడం, వెళ్లడంలో ఎటువంటి సమస్య ఎదుర్కోవు. ఈ స్టేషన్ ఇంటిగ్రేటెడ్ మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్టేషన్ నెట్‌వర్క్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది.
స్టేషన్‌లోని ఏసీ లాంజ్‌లు, వెయిటింగ్ ఏరియాలలో ప్రయాణీకులు విశ్రాంతి తీసుకోవచ్చు. స్టేషన్‌లోని వెయిటింగ్ హాల్స్ 700 నుండి 1000 మంది కూర్చునేలా రూపొందించబడ్డాయి. ఈ స్టేషన్‌లో ప్రయాణీకుల కోసం ఫాస్ట్ స్పీడ్ ఎస్కలేటర్లు, లిఫ్ట్‌లు ఉన్నాయి. అలాగే, ప్రయాణీకుల భద్రతకు ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చారు. ఇక్కడ 160 సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేశారు.
రాణి కమలాపతి రైల్వే స్టేషన్ చూసేందుకు ఒక విలాసవంతమైన రాజభవనంలా కనిపిస్తుంది. ఇక్కడ పరిశుభ్రత 5స్టార్ హోటల్ లాంటిదని చెబుతారు. ఈ స్టేషన్‌కు గోండ్ రాజవంశం చివరి రాణి రాణి కమలాపతి పేరు పెట్టారు. భోపాల్‌లోని ఈ రైల్వే స్టేషన్ నిర్వహణ బాధ్యత బన్సాల్ గ్రూప్‌కు ఇవ్వబడింది. బన్సాల్ గ్రూప్ ఈ ఒప్పందంపై 8 సంవత్సరాలు సంతకం చేసింది.