బనకచర్ల ప్రాజెక్ట్‌పై ముదురుతున్న రాజకీయం.. మళ్లీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్!

తెలంగాణలో బనకచర్లపై పొలిటికల్ ఫైట్ ఇప్పుడప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. ఈ అంశంపై ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ రగడ పీక్స్‌కు చేరుకుంది. రేవంత్ సర్కార్ వైఫల్యం వల్లే ఈ ప్రాజెక్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వం దూకుడుగా ముందుకు సాగుతోందని బీఆర్ఎస్ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. తాము ఈ అంశాన్ని లేవనెత్తే వరకు అసలు ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదని కారు పార్టీ కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తోంది.

ఈ విషయంలో ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని తెలంగాణ ప్రభుత్వం సంకేతాలు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ మరింతగా తప్పుబడుతోంది. చర్చల అంశాన్ని చూపించి కాంగ్రెస్‌ని ఇరుకునపెట్టేందుకు వ్యూహరచన చేస్తోంది. ఏపీతో చర్చలు జరపడం సరికాదని.. ముందు అపెక్స్ కమిటీ సమావేశం నిర్వహించాలని కేంద్రాన్ని కోరాలని డిమాండ్ చేస్తోంది.

బీఆర్ఎస్ టార్గెట్‌గా కాంగ్రెస్ వ్యూహలు

అయితే ఈ అంశంలో బీఆర్ఎస్‌ను ఇరుకునపెట్టేందుకు కాంగ్రెస్ కూడా పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. గోదావరి – బనకచర్ల ప్రాజెక్టు మీద అసెంబ్లీలో చర్చకు సిద్ధమా కేసీఆర్..? అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. గోదావరిలోకి 3 వేల టీఎంసీలు వెళ్తున్నాయని చెప్పింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. కుట్రలు కుతంత్రాలతో కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టును కేసీఆర్ పూర్తి చేయలేదని మండిపడ్డారు. గోదావరి జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం అసెంబ్లీలో చర్చిద్దామని కేసీఆర్‌కు సవాల్ విసిరారు. ఈ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందన్నారు.

బీఆర్ఎస్ టార్గెట్‌గా బనకచర్లపై ఉత్తమ్ ప్రజెంటేషన్

మరోవైపు గోదావరి–బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటామన్నారు మంత్రి ఉత్తమ్‌. దీనిపై కేంద్ర జలశక్తి మంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చామని.. త్వరలోనే అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. ఈ నెల 30న బనకచర్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామన్న ఉత్తమ్.. గతంలో బీఆర్ఎస్ ఈ ప్రాజెక్ట్‌కు ఎలా సహకరించిందో వివరిస్తామన్నారు. గతంలో ప్రగతిభవన్ వేదికగా ప్రాజెక్టు డిజైన్ అయిందన్నారు.

బనకచర్లపై బీఆర్ఎస్, కాంగ్రెస్ రాజకీయ ఎత్తులు

ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ రెండూ బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో రాజకీయంగా ఎత్తుకుపైఎత్తు వేస్తుండటంతో.. రాబోయే రోజుల్లో ఇది అంశంపై మరింత రగడ ఖాయమనే చర్చ జరుగుతోంది.

About Kadam

Check Also

రాజకీయాలకు దూరంగా ఉన్నా విమర్శిస్తున్నారు.. అందుకే స్పందించను.. మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు..

నేను రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నా.. అయినా.. కొందరు నాపై అకారణంగా విమర్శలు చేస్తున్నారు .. ఆ విమర్శలకు నేను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *