చైనాలోని కింగ్‌డావో నగరంలో జరిగిన SCO (షాంఘై సహకార సంస్థ) రక్షణ మంత్రుల సమావేశంలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక ప్రత్యేక నిర్ణయంపై రెండు దేశాలు అంగీకారానికి వచ్చాయి. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత కైలాష్ మానసరోవర్ యాత్ర తిరిగి ప్రారంభమవుతుందని రాజ్‌నాథ్ సింగ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ విషయంలో భారతదేశం- చైనా మధ్య సానుకూల సంభాషణ జరిగింది.
SCO సమానత్వం, సంప్రదింపులు, పరస్పర ప్రయోజనం, ప్రాంతీయ బహుపాక్షిక సహకారం షాంఘై స్ఫూర్తిని కొనసాగిస్తుందని చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్ అన్నారు. ఇది సభ్య దేశాలకు ఉమ్మడి ప్రయోజనాలపై సహకారాన్ని పెంచడానికి, పరస్పర విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి అవకాశాన్ని ఇచ్చే వేదిక అన్నారు. పరస్పర సహకారాన్ని మరింతగా పెంచడంతో పాటు వ్యూహాత్మక పరస్పర విశ్వాసాన్ని కూడా పెంచుతుందని డాంగ్ జున్ అభిప్రాయపడ్డారు.
భారత్-పాకిస్తాన్ మధ్య విభేదాలను పరిష్కరించడానికి SCO సమావేశ ఒక వేదిక కాదని, ద్వైపాక్షిక చర్చల మార్గం మాత్రమే అని చైనా పేర్కొంది. భారతదేశం-పాకిస్తాన్ మధ్య చాలా కాలంగా ఉన్న విభేదాలు అందరికీ తెలిసినవేనని, ప్రాంతీయ శాంతి కోసం ద్వైపాక్షిక మార్గాల ద్వారా ఇటువంటి సమస్యలను పరిష్కరించుకోవాలని SCO సభ్యులు పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై తన వైఖరిపై భారతదేశం జారీ చేసిన ఉమ్మడి ప్రకటనపై సంతకం చేయలేదని కొన్ని భారతీయ మీడియాలో వార్తలు వచ్చాయని చైనా పేర్కొంది. ఇది బహుపాక్షిక వేదిక, ఏకాభిప్రాయం లేకుండా ఉమ్మడి ప్రకటన సాధ్యం కాదు, కాబట్టి దీనిని భారతదేశం-పాకిస్తాన్ ద్వైపాక్షిక సమస్యతో ముడిపెట్టడం సరైనది కాదని చైనా పేర్కొంది.
పహల్గామ్ దాడిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని తీవ్రంగా విమర్శించారు. SCO జాయింట్ డ్రాఫ్ట్‌పై సంతకం చేయడానికి రక్షణ మంత్రి నిరాకరించారు. “మన ప్రాంతంలో అతిపెద్ద సవాళ్లు శాంతి, భద్రత, విశ్వాసం లేకపోవడంతో ముడిపడి ఉన్నాయని నేను నమ్ముతున్నాను. ఈ సమస్యలకు మూల కారణం తీవ్రవాదం, ఉగ్రవాదం పెరగడం. శాంతి, శ్రేయస్సు, ఉగ్రవాదం కలిసి ముందుకు సాగలేవు. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి నిర్ణయాత్మక చర్య అవసరం. మన సమిష్టి భద్రత కోసం ఈ దుష్టశక్తులకు వ్యతిరేకంగా మన పోరాటంలో మనం ఐక్యంగా ఉండాలి” అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన అంశాలపై చైనాతో నిర్మాణాత్మక, దార్శనిక అభిప్రాయాలను మార్పిడి చేసుకున్నాము. దాదాపు ఆరు సంవత్సరాల విరామం తర్వాత కైలాష్ మానస సరోవర్ యాత్ర తిరిగి ప్రారంభించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశాము” అని రాజ్‌నాథ్ సింగ్ రాశారు.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యా, బెలారస్ దేశాలకు చెందిన రక్షణ మంత్రులతో కూడా సమావేశాలు నిర్వహించారు. ఈ ద్వైపాక్షిక సమావేశాలలో, ఈ ప్రాంతంలోని సవాళ్లు, భద్రతా ముప్పులతో పాటు రక్షణ సహకారం గురించి చర్చించారు. రాజ్‌నాథ్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌లో, “క్వింగ్‌డావోలో బెలారస్ రక్షణ మంత్రి లెఫ్టినెంట్ జనరల్ విక్టర్ ఖ్రెనిన్‌తో మంచి సంభాషణ జరిగింది” అని రాశారు. అంతకుముందు, రాజ్‌నాథ్ సింగ్ రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బెలౌసోవ్‌ను కలిసి రక్షణ రంగంలో రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక, సమగ్ర సహకారం గురించి చర్చించారు. రక్షణ రంగంలో భారతదేశం రష్యాతో దీర్ఘకాలిక, సమగ్ర సహకారాన్ని కలిగి ఉన్న సంగతి తెలిసిందే. ఇది రెండు దేశాల రక్షణ మంత్రుల నేతృత్వంలోని IRIGC-M&MTC యంత్రాంగం ద్వారా మార్గనిర్దేశం చేయడం జరుగుతుంది.
ఇక పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా SCO సమావేశానికి హాజరయ్యారు. పహల్గామ్ దాడి తర్వాత భారత్-పాక్‌కు చెందిన ఇద్దరు నాయకులు ఒకే వేదికపై కలిసి కనిపించడం ఇదే మొదటిసారి. శిఖరాగ్ర సమావేశంలో, రక్షణ మంత్రి TRF పాకిస్తాన్ సంబంధాన్ని కూడా ప్రస్తావించారు.