ఎప్పటికప్పుడు అదిగో ఇదిగో అంటూ సాగుతున్న తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికపై క్లారిటీ వచ్చేసినట్టే కనిపిస్తోంది. అయితే స్టేట్ పార్టీకి కొత్త బాస్ ఎవరు అనే విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. ఆ పదవి కోసం మేం ప్రయత్నించడం లేదని కొందరు చెబుతుంటే.. అంతా హైకమాండ్ చూసుకుంటుందన్నది ఇంకొందరి వాదన. ఇలాంటి ప్రశ్నలన్నింటికీ మరికొద్ది రోజుల్లోనే సమాధానం రాబోతున్నట్టు తెలుస్తోంది
తెలంగాణలో ఈసారి అధికారం మాదే. రాష్ట్రంలో మేం అధికారంలోకి రాకుండా అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు. తెలంగాణలోని బీజేపీ నేతలు పదే పదే చాలా ధీమాగా చెప్పే మాటలివి. పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు తరువాత తెలంగాణలో తమ గెలుపుపై బీజేపీకి ఉన్న అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. అలాగే కార్యాచరణ రూపొందించే దిశగా జాతీయ నాయకత్వం కూడా ఎప్పటికప్పుడు కీలక సూచనలు చేస్తోంది. ఇన్నీ చేస్తున్నా.. రాష్ట్రంలోని పార్టీకి నాయకత్వం వహించే కొత్త బాస్ ఎన్నిక విషయంలో మాత్రం బీజేపీ హైకమాండ్ ఎటూ తేల్చడం లేదు. ఈ పదవి కోసం నేతల మధ్య పోటీ ఎక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణమనే చర్చ జరుగుతోంది.
దేశవ్యాప్తంగా బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ
దేశవ్యాప్తంగా బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. దశల వారీగా ఆయా రాష్ట్రాలకు అధ్యక్షులను నియమిస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరో మూడు రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నిక కోసం ఎలక్షన్ ఆఫీసర్స్‌ను నియమించింది. మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఎలక్షన్ ఆఫీసర్లను నియమించింది. మరోవైపు త్రిపుర, ఆంధ్రప్రదేశ్‌కు రాష్ట్ర శాఖల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఇప్పటి వరకు 14 రాష్ట్రాలకు అధ్యక్షుల ఎంపిక పూర్తికాగా.. మిగిలిన రాష్ట్రాలకు అధ్యక్షుల ఎంపిక ప్రక్రియపై బీజేపీ దృష్టి సారించింది. ఈ ప్రక్రియ వేగవంతం కావడంతో తెలంగాణ బీజేపీకి కూడా కొత్త బాస్ త్వరలోనే వస్తారనే చర్చ జోరందుకుంది.
తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికపై లక్ష్మణ్ సంకేతాలు
తెలంగాణ బీజేపీ ముఖ్యనేత, బీజేపీ జాతీయ రిటర్నింగ్ ఆఫీసర్ లక్ష్మణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా రాష్ట్ర పార్టీ కొత్త అధ్యక్షుడి ఎన్నికకు కౌంట్ డౌన్ మొదలైందనే ప్రచారాన్ని బలపరుస్తున్నాయి. జులై రెండో వారం నాటికి తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందన్నారు లక్ష్మణ్. ఇక అధ్యక్ష పదవి ఎవరికి దక్కొచ్చనే అంశంలోనూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నేతల విషయంలో పాత, కొత్త అనే తేడాలు ఉండబోవని అన్నారు. ఆయన మాటలతో కొత్త అధ్యక్షుడి ఎంపికపై సస్పెన్స్ మరింత పెరిగిపోయింది.
వారి మధ్యనే పోటీ.. ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఎంపీ ఈటల రాజేందర్, బండి సంజయ్, డీకే అరుణ, రఘునందన్‌రావు, ధర్మపురి అర్వింద్ సహా పలువురు నేతలు పోటీ పడుతున్నారనే టాక్ అటు బీజేపీ వర్గాలు, ఇటు పొలిటికల్ సర్కిల్స్‌లో ఎప్పటి నుంచో వినిపిస్తోంది. కొందరు ఈ పదవి రేసులో తాము లేమని చెబుతున్నా.. లోలోపల మాత్రం తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారనే చర్చ జరుగుతోంది. దీంతో ఈ సారి అధ్యక్ష పీఠం ఎవరికి దక్కొచ్చనే దానిపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు తెలంగాణలో అధికారం దక్కించుకోవడానికి తీవ్రంగా కసరత్తు చేస్తున్న పార్టీ జాతీయ నాయకత్వం.. అధ్యక్షుడి ఎంపిక విషయంలోనూ అదే స్థాయిలో కసరత్తు చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి ఆ కసరత్తు క్లైమాక్స్‌కు చేరుకుంటుందా లేక మళ్లీ ఈ వ్యవహారాన్ని పెండింగ్‌లో పెడతారా ? అన్నది చూడాలి.