ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. వారందరికీ KTR వార్నింగ్‌! చట్టపరమైన చర్యలు తప్పవంటూ..

తెలంగాణలోని ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పార్టీ నేతలపై అవాస్తవ ప్రచారం చేస్తున్న వారికి కేటీఆర్ హెచ్చరిక జారీ చేశారు. అసత్య ప్రచారం, దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కేటీఆర్ ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనతో పాటు పార్టీ నేతలపై అడ్డగోలుగా దుష్ప్రచారం చేస్తున్నారంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్‌ ఇచ్చారు. అబద్ధాలు అసత్యాలు దురుద్దేశపూర్వక ప్రచారాలు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణలో ఈ ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ట్యాపింగ్‌ కేసు విచారణ శరవేగంగా సాగుతోంది. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌ అగ్రనేతల అరెస్టులు కూడా జరగొచ్చని ఊహాగానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. ఫోన్‌ ట్యాపింగ్‌పై కొంతమంది బీఆర్‌ఎస్‌ నేతలపై ఆరోపణలు చేస్తూ.. టాలీవుడ్‌ హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్‌ చేసి.. వారిని లోబర్చుకోవాలని ప్రయత్నించారంటూ తీవ్రమైన ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్‌ అలాంటి వాటిపై ఘాటుగా స్పందించారు.

“కొంతమంది వ్యక్తులు మీడియా ముసుగులో కావాలనే ఇలాంటి నీచమైన దుష్ప్రచారం చేస్తున్నారు. కావాలని కొన్ని మీడియా సంస్థలు, కొంతమందితో జట్టు కట్టి ఒక ముఠాగా మారి చేస్తున్న దుష్ప్రచారంపై చట్టపరంగా తగిన సమాధానం చెబుతాం. గత కొన్ని నెలలుగా కొంతమంది విలేకరుల వేషం వేసుకున్న కొంతమంది మీడియా సంస్థల యజమానులు నా పైన వ్యక్తిగతంగా, మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై విషం చిమ్ముతున్నారు. అలాంటి వ్యక్తులు వ్యక్తపరుస్తున్న నీచమైన అభిప్రాయాలు నాపైన వ్యక్తిగతంగా ఎలాంటి ప్రభావం చూపించవు. కానీ పదేపదే వీరు చేస్తున్న వ్యక్తిత్వ హననం వలన మా కుటుంబ సభ్యుల పైన తీవ్రమైన దుష్ప్రభావం చూపిస్తున్నాయి. మీడియా రూపంలో వీరు చేస్తున్న దాడులు నా శ్రేయోభిలాషులు, పార్టీ నాయకులను, పార్టీ శ్రేణులను బాధ కలిగిస్తున్నాయి. వారి ఒక్కొక్కరిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాను. కలిసికట్టుగా వెనుక ఉండి నడిపిస్తున్న వారితోపాటు, దుర్మార్గపూరితంగా ఇలాంటి నీచమైన ప్రయత్నాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి తగిన రీతిలో చట్టపరంగా ఎదుర్కొంటాం.” అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

About Kadam

Check Also

నిరుద్యోగులకు ఎగిరి గంతేసే న్యూస్.. త్వరలోనే 5 జాబ్ నోటిఫికేషన్లు వస్తున్నాయ్!

రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ పరిధిలో దాదాపు 24 డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్ల (డిప్యూటీ ఈఓ) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *