ఆధునిక కాలంలో ప్రపంచం కుగ్రామంగా మారింది. ఒక దేశం నుంచి మరో దేశానికి రాకపోకలు విపరీతంగా పెరిగాయి. దానికి అనుగుణంగానే వేల సంఖ్యలో విమానాలు నిత్యం వివిధ దేశాల మధ్య రాకపోకలు సాగిస్తున్నాయి. చదువు, వ్యాపారం, ఉద్యోగం, వివాహం, పర్యటన తదితర కారణాలతో చాలా మంది భారతీయులు విదేశాలకు వెళతున్నారు. ఆ ప్రయాణానికి ముందుగా పాస్ పోర్టు అవసరం.
గతంలో పాస్ పోర్టు కావాలంటే నిబంధనల ప్రక్రియ చాాలా ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం పాస్ పోర్టు సేవ 2.0 అందుబాటులోకి వచ్చింది. ప్రజలకు వేగంగా, సులభంగా సేవలందించడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ నేపథ్యంలో ఈ విధానం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. పాస్ పోర్టు సేవ (పీఎస్ఫీ) 2.0ను విదేశాంగ మంత్రి జై.శంకర్ ఈ ఏడాది జూన్ 24న భారతీయులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. పాస్ పోర్టు సేవా దివస్ సందర్భంగా ఈ కొత్త విధానం అమలు చేశారు. దీనిలో భాగంగా ఇక నుంచి ఇ-పాస్ పోర్టులను జారీ చేస్తారు. ఇవి కాంటాక్ట్ లెస్ చిప్ ఆధారిత టెక్నాలజీతో పని చేస్తాయి. దరఖాస్తుదారులకు మరింత వేగంగా పాస్ పోర్టు అందించడం, విదేశీ ప్రయాణాన్నివేగవంతం చేయడం, ఇమ్మిగ్రేషన్ ను సులభతరం చేయడం, పోలీస్ యాప్ ధ్రువీకరణ సమయాన్ని ఐదు నుంచి ఏడు రోజులకు తగ్గించడం దీని ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి.
ఈ-పాస్‌పోర్ట్ ప్రత్యేకతలు
- ఈ-పాస్ పోర్టులో సెక్యూర్ ఎంబెడెడ్ చిప్ ను అమర్చారు. దీనిలో వ్యక్తిగత వివరాలన్నీ నమోదు చేస్తారు.
- వేలిముద్రలు, ఐరిస్ స్కాన్, ముఖ ఛాయాచిత్రం తదితర బయోమోట్రిక్ స్టోరేజీ ఉంటుంది.
- విమానాశ్రయంలో తనిఖీలు వేగంగా జరుగుతాయి.అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏవో) నిర్దేశించిన అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.
- డేటా ఫోర్జరీ, డూప్లికేషన్ కు అవకాశం దాదాపు ఉండదు.
దరఖాస్తు ఇలా
అవసరమైన అన్ని పత్రాలతో సరైన సమయానికి పీఎస్కే వద్ద హాజరుకావాలి.
పాస్ పోర్టు సేవా పోర్టల్ ను సందర్శించాలి. భారత ప్రభుత్వం నిర్వహించే అధికారిక వైబ్ సైట్ కు వెళ్లాలి.
దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఖాతాను తెరవాలి.ఇప్పటికే ఉన్న వారు పాస్ వర్డ్ ను ఉపయోగించి లాగిన్ అవ్వాలి.
ఇ-పాస్ పోర్టు ఆప్షన్ ను ఎంపిక చేసుకుని, మీ వ్యక్తిగత ఇతర వివరాలను నమోదు చేయాలి.
సమీపంలోని పాస్ పోర్టు సేవాకేంద్రం (పీఎస్కే), పోస్ట్ ఆఫీస్ పాస్ పోర్టు సేవా కేంద్రం (పీవోపీఎస్కే)లను ఎంపిక చేసుకోవాలి.
దానిలో తెలిపిన ప్రకారం దరఖాస్తు రుసుమును చెల్లించాలి.
బయెమెట్రిక్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ ను షెడ్యూల్ చేసుకోవాలి.