ప్రఖ్యాత హిప్నాటిస్ట్, సైకాలజిస్ట్, వ్యక్తిత్వవికాస నిపుణులు డాక్టర్ పట్టాభి రామ్ (75) కన్నుమూశారు. సోమవారం (జూన్ 30) రాత్రి 9.45 గంటలకు గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఇంద్రజాలకుడిగా (మెజీషియన్) తన ప్రయాణాన్ని ప్రారంభించి, కెరీర్లో అంచలంచెలుగా ఎదిగారు. ఆయన తన జీవితకాలంలో అనేక బెస్ట్ సెల్లింగ్ మోటివేషనల్ పుస్తకాలను రచించారు. యువతకు లెక్కకుమించి మోటివేషన్ స్పీచ్‌లు ఇచ్చారు. ముఖ్యంగా విద్యార్ధులు, యువత కోసం ఆయన అహోరాత్రులు కష్టించారు. సానుకూల ఆలోచనలను రేకెత్తించడానికి, ప్రేరేపించడానికి, జీవిత సవాళ్లను అధిగమించి ఉన్నతంగా ఎదగడం.. వంటి ఎన్నో అంశాలను సృజించి ఎంతో మందికి జీవితంపై ఆశలను చిగురింపజేశారు.
డాక్టర్ పట్టాభి రామ్ భౌతికకాయాన్ని జూలై 2వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఖైరతాబాద్‌లోని ఆయన నివాసంలో సందర్శనార్థం ఉంచుతారు. ఆయన అంత్యక్రియలు జూలై 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు మహాప్రస్థానంలో జరుగుతాయి. పట్టాభిరామ్‌కు భార్య జయ, కొడుకు ప్రశాంత్ ఉన్నారు. కాగా బీవీ పట్టాభిరామ్ పూర్తి పేరు.. భావరాజు వేంకట పట్టాభిరామ్. ఆయన స్వస్థలం తూర్పుగోదావరి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రావ్ సాహెబ్ భావరాజు సత్యనారాయణ 15 మంది సంతానంలో ఒకరు. పట్టాభిరామ్ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, హిప్నాటిస్టు, మెజీషియన్‌గా మాత్రమేకాదు ఆయన నటుడు కూడా. తెలుగు, ఇంగ్లీషు, కన్నడ, తమిళ భాషల్లో ఎన్నో మోటివేషనల్ పుస్తకాలు రాశారు. దూరదర్శన్‌లో అనేక మేజిక్ షోలు ఇచ్చారు. 1990లలో పలు పత్రికలో ‘బాలలకు బంగారుబాట’, బాలజ్యోతి అనే బాలల పత్రికలో ‘మాయావిజ్ఞానం’ పేరిట వ్యాసాలు రాశారు. పట్టాభిరామ్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టా పొందారు.
ఆ తర్వాత సైకాలజీ, ఫిలాసఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లలో డిగ్రీలు చేశారు. గైడెన్స్, కౌన్సిలింగ్, జర్నలిజంలో పీజీ డిప్లమా కోర్సులు సైతం చేశారు. మానసిక శాస్త్రం, ఫిలాసఫీ గైడెన్స్ కౌన్సెలింగ్, హిప్నోథెరపీలలో అమెరికా నుంచి పోస్ట్‌గ్రాడ్యుయేట్ పట్టా తీసుకున్నారు. వ్యక్తిత్వవికాసం, సెల్ఫ్ హిప్నాటిజం వంటి అంశాలపై భారత్‌తోపాటు అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా, థాయ్‌లాండ్, సింగపూర్, అరబ్ వంటి దేశవిదేశాల్లో వర్క్‌షాప్‌లు నిర్వహించారు. హిప్నోసిస్పై ఆయన చేసిన కృషికిగానూ 1983లో ఫ్లోరిడా యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది.