ఒకప్పుడు పాకీజాగా తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటి వాసుకి ఇప్పుడు దీన స్థితిలో ఉన్నారు. తనను ఆదుకోవాలంటూ ఆమె ఇటీవల ఒక వీడియోను రిలీజ్ చేశారు. నటి దీన స్థితిని చూసి చలించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాకీజాకు తక్షణ సాయం ప్రకటించారు.
తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సినీ నటి వాసుకి (పాకీజా)కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆపన్న హస్తం అందించారు. ఆమె దీన స్థితి తెలిసి చలించిన పవర్ స్టార్ రూ. 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. మంగళవారం (జులై 01) మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఈ మొత్తాన్ని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పి. హరిప్రసాద్ , పి.గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ పాకీజాకు ఈ ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన సాయానికి పాకీజా కృతజ్ఞతలు తెలిపారు. చిన్నవాడైనా ఎదురుగా ఉంటే కాళ్లు మొక్కుతానంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తన ఆర్థిక పరిస్థితి గురించి నిన్ననే పవన్ కళ్యాణ్ కార్యాలయానికి తెలియజేశాననీ, తక్షణం స్పందించి తగిన విధంగా ఆర్థిక సాయం అందించారని నటితెలిపారు. కాగా ఇటీవల వాసుకి ఓ వీడియోను విడుదల చేశారు. అందులో తాను దీనస్థితిలో ఉన్నట్లు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు . ‘‘నేను హాస్య నటి పాకీజాను. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలకు నా నమస్కారాలు. నేను చాలా కష్టాల్లో ఉన్నాను. మూడేళ్లుగా సినిమా అవకాశాల్లేక ఇబ్బంది పడుతున్నాను. ఇండస్ట్రీలో అవకాశాలు లేకపోవడంతో నా సొంత ఊరుకు వచ్చేశాను. ఏదైనా సాయం చేస్తారేమోనని సీఎంను కలవడానికి నేను రెండుసార్లు విజయవాడ వచ్చాను. కానీ, కలవడం చాలా కష్టమైంది. ఆ తర్వాత డిప్యూటీ సీఎంను కలవాలని ప్రయత్నించినా కలవలేకపోయాను.
‘ ఏపీలో నాకు నెల నెలా పెన్షన్ వచ్చేట్లు ఏదైనా సాయం చేయండి. మీ కాళ్లు పట్టుకుని వేడుకుంటాను. భర్త, పిల్లలు ఎవరూ లేరు. అనాథగా జీవితం గడుపుతున్నాను. గతంలో చిరంజీవి గారు, నాగబాబు గారు సాయం చేశారు. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు గారు, పవన్ గారు దయచేసి నన్ను ఆదుకోవాలి. నాకు కనీసం పెన్షన్ అందేలా చేయండి’’ అని వాసుకి కోరారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. దీనిని చూసిన పవన్ కల్యాణ్ తక్షణ సాయం కింద ఆమెకు రూ. 2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.