హైదరాబాద్‌లో ఏనుగు దంతాల కేసు.. కట్‌చేస్తే.. తిరుమల శేషాచలంలో కదిలిన డొంక..!

శేషాచలం అటవీ ప్రాంతం దట్టమైన అడవులు అరుదైన వృక్ష జంతు జాతులకు నిలయం. అయితే ఈ మధ్య స్మగ్లర్ల బెడద శేషాచలం కొండల్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఎర్రచందనం స్మగ్లర్ల అలజడి ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే ఇప్పుడు ఏనుగుల దంతాల కేసు మూలాలు శేషాచలం అటవీ ప్రాంతానికి ముడి పెట్టడంతో అటవీశాఖలో ఆందోళన ప్రారంభమైంది. ఎర్రచందనం చెట్లు నేలకొరుగుతున్నట్లే వన్యప్రాణులు కూడా అంత మొందుతున్నాయా అన్న అనుమానం కలుగుతోంది. తాజాగా హైదరాబాదులో నమోదైన ఏనుగు దంతాల కేసు ఉమ్మడి చిత్తూరు జిల్లా అటవీ శాఖను భయపెడుతోంది. దీంతో ఇప్పటిదాకా ఎర్రచందనం అక్రమ రవాణా మీదే దృష్టి సారించిన అటవీ శాఖ ఒక్కసారిగా కలవర పాటుకు గురైంది. విలువైన ఏనుగు దంతాల అక్రమ రవాణాకు శేషాచలం అటవీ ప్రాంతంలో బీజం పడిందా.? అన్నట్టు హైదరాబాద్ ఏనుగు దంతాల కేసు విచారణ సాగుతోంది.

శేషాచలం అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల రక్షణతో పాటు అడవుల సంరక్షణకు టెక్నాలజీని వాడుతున్న అటవీ శాఖ డ్రోన్లు, నైట్ మోడ్ కెమెరాలు, మోషన్ క్యాప్చర్ కెమెరాలు ఏర్పాటు చేసిన రక్షణ ప్రశ్నార్ధకంగానే ఉందన్న విషయం స్పష్టం అవుతుంది. అటవీ శాఖ లెక్కల ప్రకారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వందకు పైగా ఏనుగులు ఉండగా శేషాచలం అడవుల్లో ఆ సంఖ్య 50 వరకు ఉంటుంది. యాంటీ పోచింగ్ విభాగం తో పాటు రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ సరిహద్దు అటవీ భద్రతా సిబ్బంది, అటవీ శాఖ తనిఖీ కేంద్రాల వద్ద నిరంతరం నిఘా కొనసాగుతున్నా హైదరాబాద్‌లో వెలుగు చూసిన దంతాల స్మగ్లింగ్ కేసు అటవీ శాఖ వైఫల్యాలను బయట పెడుతోంది. ఈ నేపధ్యంలోనే హైదరాబాదులో దొరికిన ఏనుగు దంతాలు భాకరాపేటలో చోరీకి గురైనవేనా అన్న అనుమానం వెలుగు చూస్తోంది. రెండేళ్ల క్రితం అటవీ శాఖలో కలకలం రేపిన దంతాలు, గన్ ల చోరీ కేసుకు లింక్ చేసి విచారణ జరుగుతోంది.

గజరాజుల రక్షణ ప్రశ్నార్ధకమేనా.?: ఇక, హైదరాబాద్ పోలీసులకు చిక్కిన ఏనుగు దంతాలు భాకరాపేట అటవీశాఖ రేంజ్ ఆఫీసులో చోరీకి గురైనవేనా అనే అనుమానం బలంగా వినిపిస్తోంది. ఏనుగు దంతాలను తరలిస్తూ పట్టుబడ్డ డ్రైవర్ ప్రసాద్ అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన వాడు కాగా, ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ ఫిబ్రవరిలో టాస్క్ఫోర్స్ పోలీసులకు చిక్కి జైలుకు కూడా వెళ్లాడు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ బస్సులో ప్రయాణిస్తున్న అతని వద్ద ఏనుగు దంతాలు లభించడం సంచలనమే సృష్టించింది. తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లోని అడవుల్లో గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ హయంలో ఏనుగులను చంపి వాటి దంతాలను స్మగ్లింగ్ చేయగా, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏనుగులను వేటాడి చంపిన దాఖలాలు లేకపోయినా, తాజా ఘటన కలకలం రేపుతోంది. ప్రసాద్ చేత పట్టుబడ్డ ఏనుగు దంతాలు ఎక్కడివన్న ప్రశ్న అందరినీ కలవరపాటుకు గురిచేస్తోంది. అటవీ శాఖ ఇప్పటికే కమిటీ ని నియమించి విచారణ చేస్తుండగా నెలరోజుల్లోపు వాస్తవాలు వెలుగు చూడనున్నాయి. పట్టుబడ్డ ఏనుగు దంతాలను డెహ్రాడూన్ లోని ల్యాబ్ కు పంపిన అటవీశాఖ ఇప్పటికే అంతర్గత విచారణ జరుపుతోంది.

భాకరాపేట లో చోరీ అయినవేనా..? లేక వేటాడిన దంతాలా..?: 2013లో తలకోన అటవీ ప్రాంతాల్లో రెండు ఏనుగులు ప్రమాదవశాత్తు చనిపోగా ఒక ఏనుగు దంతాలు అప్పట్లో భాకరాపేట రేంజ్ ఆఫీసులో భద్రపరిచారు. అయితే 2023లో భాకరాపేట రేంజ్ ఆఫీసులో ఉన్న ఏనుగు దంతాలతో పాటుగా గన్ కూడా చోరీ కి గురైంది. దీనిని గుర్తించిన అటవీశాఖ అధికారులు భాకరాపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, అప్పటి నుంచి ఇప్పటి దాకా ఈ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఇప్పుడు తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు కేసు విచారణపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే సస్పెండ్ చేసిన అధికారులు ఇప్పుడు ఈ కేసులో సీరియస్ గా పరిగణించి విచారిస్తున్నారు. హైదరాబాదులో స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ దంతాలు, భాకరాపేట ఆఫీసులో చోరికి గురైన ఏనుగుల దంతాలు ఒకటేనా… లేదంటే ఏనుగులను వేటాడి దంతాలు స్మగ్లింగ్ చేశారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు వాస్తవాలు రాబట్టే పనిలో ఉన్నారు.

About Kadam

Check Also

ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్ ప్రవేశాల గడువు పెంపు.. ఎప్పటి వరకంటే?

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాల గడువు జూన్‌ 30వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *