చిరుతను మొబైల్ లో క్యాప్చర్ చేసిన యువకులు అటవీ ప్రాంతంలోకి తరిమేసే ప్రయత్నం చేసారు. ఆటో, బైక్ లైటింగ్ సాయంతో శబ్దాలు చేస్తూ చిరుతను తరిమేందుకు ప్రయత్నం చేశారు. కాసేపు అక్కడే మాటు వేసిన చిరుత ఆ తరువాత అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోవడంతో అలిపిరి నుంచి జూ పార్క్ రోడ్డులో వెళ్లేవాళ్లు, కంటి ఆసుపత్రికి వచ్చిన వారు ఊపిరి పీల్చుకున్నారు.
శేషాచలం అటవీ ప్రాంతం నుంచి బయటకు వస్తున్న చిరుతలు జనాన్ని భయపెడుతున్నాయి. జనావాసాల్లోకి వచ్చి సందడి చేస్తుండడంతో భక్తుల్లో అలజడి రేపుతోంది. జులై 1 మంగళవారం రోజున సాయంత్రం 6 గంటల సమయంలో తిరుమలలో కనిపించిన చిరుత కలకలం రేపింది. అన్నమయ్య భవన్ సమీపంలో తిష్ట వేసిన చిరుత గెస్ట్ హౌస్ వెనుక వైపు ఉన్న కంచెను దాటుకొని గోడపై సేదతీరుతూ కంటపడింది. గెస్ట్ హౌస్ వేనుకవైపు ఉన్న చెత్తాచెదారం వద్ద సంచరించే పందులు, కుక్కల కోసం వేట కొనసాగించింది. ప్రహరీ గోడ పై కూర్చుని మాటువేసిన చిరుత అక్కడి వారి కంట పడింది.
స్థానికుల సమాచారం మేరకు చిరుత సంచారం తెలుసుకున్న టిటిడి అటవీశాఖ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుంది. కానీ, అప్పటికే అక్కడున్న టిటిడి సిబ్బంది, భక్తులు పెద్ద పెద్ద శబ్దాలు చేసి చిరుతను అటవీ ప్రాంతం లోకి తరిమేసే ప్రయత్నం చేశారు. దీంతో చిరుత అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోగా భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. అప్రమత్తమైన టిటిడి సిబ్బంది చిరుత సంచారించిన ప్రాంతంలో క్షుణ్ణంగా తనిఖీ చేసి చిరుత మూమెంట్ పై నిఘా పెట్టారు.
మరోవైపు తిరుపతిలోనూ చిరుత హల్చల్ చేసింది. మంగళవారం రాత్రి జూ పార్క్ రోడ్డు లోని అరవింద్ ఐ ఆసుపత్రి వద్ద చిరుత స్థానికుల కంట పడింది. చిరుతను మొబైల్ లో క్యాప్చర్ చేసిన యువకులు అటవీ ప్రాంతంలోకి తరిమేసే ప్రయత్నం చేసారు. ఆటో, బైక్ లైటింగ్ సాయంతో శబ్దాలు చేస్తూ చిరుతను తరిమేందుకు ప్రయత్నం చేశారు. కాసేపు అక్కడే మాటు వేసిన చిరుత ఆ తరువాత అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోవడంతో అలిపిరి నుంచి జూ పార్క్ రోడ్డులో వెళ్లేవాళ్లు, కంటి ఆసుపత్రికి వచ్చిన వారు ఊపిరి పీల్చుకున్నారు.