దేవుడికి జలాభిషేకం, పాలాభిషేకం, పుష్పఅభిషేకం చేయడం చూసాం కానీ శ్రీకాకుళం జిల్లాలో భక్తులు వడలతో అభిషేకం చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. జిల్లాలోని పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ లోగల ఆంజనేయస్వామి ఆలయంలో శ్రీ ఆంజనేయ ట్రాలీ రిక్షా యూనియన్ కార్మికులు అంజనీసుతునికి నోరూరించే 10,116 (పదివేల నూటపదహారు) వడలతో అభిషేకం చేసి పట్టణంలో హాట్ టాపిక్ గా నిలిచారు.
ఆంజనేయ స్వామికి వడలు అంటే ఎంతో ఇష్టం. అందుకే ఆయనకు చాలామంది భక్తులు వడలను నైవేద్యంగా సమర్పిస్తారు. కొందరు ఈ వడలనే మాలగా కూర్చి వడ మాలను స్వామివారికి సమర్పిస్తారు. ప్రతియేడు ట్రాలీ రిక్షా కార్మికులు సంబరం చేస్తూ ఆంజనేయస్వామికి మొక్కులు తీర్చుకుంటుంటారు. ఇదే క్రమంలో ఈఏడు కూడా మంగళవారంనాడు ఆంజనేయస్వామికి మొక్కులు తీర్చుకునే నేపథ్యంలో ఆలయం వద్దనే స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైన వడలు వండి స్వామివారికి 10 వేల116 వడలుతో అభిషేకం చేసి తమ భక్తి ప్రవక్తలను చాటుకున్నారు.
కొన్ని వడలను మాలగా కూడా చేసి ఆంజనేయస్వామి మెడలో దండగ వేశారు. వడలతో అభిషేకాలు, పూజలు చేసిన అనంతరం ఆ వడలను భక్తులు స్వామి వారి ప్రసాదంగా అందరికీ పంచిపెట్టారు నిర్వాహకులు. ఈకార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర్ శివాజీ, ట్రాలీ రిక్షా యూనియన్ అధ్యక్షుడు దువ్వాడ శ్రీకాంత్ తోపాటు వందలాదిమంది, కార్మికులు పాల్గొన్నారు.