కంపెనీలో జరిగిన ప్రమాదంపై సిగాచీ సంస్థ ఎట్టకేలకు స్పందించింది. ప్రమాదానికి సంబంధించిన ఒక లేక విడుదల చేసింది. ఈ ఘటనలో 40 మంది చనిపోగా.. 33మంది గాయపడినట్లు తెలిపింది. చనిపోయిన కుటుంబాలకు రూ.కోటి రూపాయల పరిహారం ఇవ్వడంతో పాటు అన్నిరకాల బీమా క్లైమ్‌లను చెల్లిస్తామని చెప్పింది.35 ఏళ్లుగా కంపెనీని నడుపుతున్నామని.. ఎన్నడూ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపింది.
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ కంపెనీలో జరిగిన ప్రమాదం అందరినీ కలిచివేస్తోంది. ఈ ఘటనలో 40 మంది మరణించగా.. 33మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంపై నిన్నటి వరకు కంపెనీ ఎటువంటి ప్రకటన చేయలేదు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అటు సీఎం రేవంత్ సైతం కంపెనీ యాజమాన్యంపై ఫైర్ అయ్యారు. 24 గంటల్లోగా స్పందించాలని హెచ్చరించారు. పోలీసులు సైతం కంపెనీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యాజమాన్యంపై 105, 110, 117 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ ముమ్మరం చేశారు. ఎట్టకేలకు ప్రమాదంపై సిగాచీ సంస్థ స్పందించింది. ప్రమాదానికి సంబంధించి ఒక లేక విడుదల చేసింది. అదేవిధంగా స్టాక్ ఎక్స్ ఛేంజ్ సంస్థ బీఎస్ఈకి సైతం సమాచారం ఇచ్చింది.
ఈ ఘటనలో 40 మంది చనిపోగా.. 33మంది గాయపడినట్లు తెలిపింది. చనిపోయిన కుటుంబాలకు రూ.కోటి రూపాయల పరిహారం ఇవ్వడంతో పాటు అన్నిరకాల బీమా క్లైమ్‌లను చెల్లిస్తామని చెప్పింది. క్షతగాత్రుల వైద్య ఖర్చులు, కుటంబ పోషణను తామే చూసుకుంటామని ప్రకటించింది. 35 ఏళ్లుగా కంపెనీని నడుపుతున్నామని.. ఎన్నడూ ఎలాంటి ప్రమాదం జరగలేదని కంపెనీ తెలిపింది. ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణం కాదని చెప్పింది. ప్రమాదంపై ప్రభుత్వ నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చింది. 3 నెలల పాటు కంపెనీని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. బాధిత కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చింది. ఈ ఘటనలో ప్రభుత్వానికి అన్ని విధాల సహకరిస్తామని స్పష్టం చేసింది.
మరోవైపు మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుంది. మృతదేహాలు కాలిపోవడంతో డీఎన్ఏ పరీక్షలు చేసి కుటుంబసభ్యులకు అప్పగిస్తున్నారు. ఇప్పటివరకు అధికారికంగాద 36 మృతదేహాలను గుర్తించగా.. అందులో 16 శవాలకు డీఎన్ఏ పరీక్షలు పూర్తయ్యాయి. ఆస్పత్రులు, ప్రమాద స్థలి వద్ద బాధిత కుటుంబాల రోదనలు అందరినీ కలిచివేస్తున్నాయి. కాగా భద్రతా ప్రమాణాలు పాటించని కెమికల్ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. కంపెనీల్లో సేఫ్టీ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.