కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ. 1292.74 కోట్ల విలువైన అభివృద్ధి, సంక్షేమ పనులను ప్రారంభించారు. హంద్రీనీవా ప్రాజెక్టు, సోలార్ రూఫ్‌టాప్ ప్యానెళ్లు, గ్యాస్ కనెక్షన్లు, పెన్షన్లు, రోడ్లు, తాగునీరు వంటి పలు అంశాలపై దృష్టి సారించారు. గత ప్రభుత్వాలను విమర్శిస్తూ, సుపరిపాలనపై దృష్టి పెడుతున్నామని ప్రకటించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు తన నియోజకవర్గం కుప్పంలో పలు అభివృద్ధి, సంక్షేమ పనులను ప్రారంభించారు. ఇంటింటికి టీడీపీ అనే కార్యక్రమంలో భాగంగా సీఎం కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. స్వర్ణ కుప్పం ప్రాజెక్టులో భాగంగా మొత్తం రూ.1292.74 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి, సంక్షేమ, ప్రత్యేక పథకాలను ప్రారంభించారు. వీటిలో ఇప్పటికే రూ.125.13 కోట్ల విలువైన అభివృద్ధి పనులు పూర్తి అయ్యాయి. ఈ కార్యక్రమం సందర్భంగా శాంతిపురం మండలం తుంశిలోని ఏపీ మోడల్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. “విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని వికాసం వైపుగా నడుపుతున్నాం. సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా మీ ముందుకు వచ్చా. దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా కుప్పాన్ని తయారు చేస్తాం.
రూ. 3890 కోట్ల వ్యయం చేసి హంద్రినీవా పనులు పూర్తి చేస్తున్నాం. కుప్పంలో చివరి ఆయకట్టు వరకూ నీళ్లు తీసుకొస్తాం. ఈ ఏడాదిలోనే కుప్పం నియోజకవర్గానికి హంద్రీనీవా నీళ్లు పారిస్తాం.” అని అన్నారు. అలాగే గత వైసీపీ పాలనపై విమర్శలు చేస్తూ.. “అభివృద్ధి చేసే వారికి మాత్రమే సంక్షేమం గురించి మాట్లాడే హక్కు ఉంటుంది. అప్పు చేసి సంక్షేమం చేస్తామనటం ఏం పరిపాలన..? అప్పు తెచ్చి అభివృద్ధి చేసి వచ్చిన ఆదాయాన్ని సంక్షేమానికి ఖర్చు చేయటమే నిజమైన ఆర్థిక వ్యవస్థ. గతేడాదిగా రాష్ట్రంలో ఈ విధానాన్నే అవలంబిస్తున్నాం.” అని అన్నారు. రాష్ట్రంలో గుంతలు లేని రహదారులే లక్ష్యంగా పని చేశామని, గతంలో మహిళలు కట్టెల పొయ్యిపై వంట చేయకూడదని దీపం పథకం అమలు చేశామని, నాడు దీపంతో గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం.. నేడు దీపం 2.0తో ఉచిత సిలెండర్లు ఇస్తున్నామని సీఎం వెల్లడించారు.
అభివృద్ధి పనులు ప్రారంభం..
ఈ కార్యక్రమం సందర్భంగా సీఎం చంద్రబాబు రూ.47 కోట్లతో 30 కిలోమీటర్ల మేర పూర్తైన హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులు ప్రారంభించారు. 1000 మంది మహిళా లబ్దిదారులకు కొత్తగా గ్యాస్ కనెక్షన్లు, 3041 మంది లబ్దిదారులకు కొత్తగా పెన్షన్లు అందజేశారు. 7,488 ఎస్సీ ఎస్టీ గృహాలకు రూ.21.80 కోట్ల వ్యయంతో పీఎం సూర్యఘర్ యోజన కింద సోలార్ రూఫ్ టాప్ ప్యానళ్లు ఏర్పాటు పనులు ప్రారంభించారు. వచ్చే ఏడాది జనవరి నాటికల్లా సోలార్ ప్యానళ్లు ఏర్పాటు పూర్తి చేసేలా కార్యాచరణ ఉండాలని సంబంధింత అధికారులను ఆదేశించారు. కుప్పం నియోజకవర్గంలో చెత్త సేకరణకు 130 ఎలక్ట్రిక్ ఆటోలను ప్రారంభించారు. పేటీఎం సంస్థ సీఎస్ఆర్ నిధులతో అడ్వాన్సు లైఫ్ సపోర్టు అంబులెన్సులు, 400 అంగన్‌వాడీ కేంద్రాల్లో కేర్ అండ్ గ్రో కార్యక్రమాన్ని ప్రారంభించారు. పీఎం కుసుమ్ పథకం కింద రూ.564 కోట్లతో వ్యవసాయ ఫీడర్లకు సౌర విద్యుత్ అందేలా కార్యాచరణ రూపొందించారు.
దీని ద్వారా 32,106 వ్యవసాయ పంపుసెట్లకు సౌర విద్యుత్ అందనుంది. కుప్పంలో టూరిజం అభివృద్ధికి తోడ్పడనున్న లీ కంఫర్ట్ 3 స్టార్ రిసార్టును సీఎం ప్రారంభించారు. 1387 మంది దివ్యాంగులకు ఉపకరణాలు అందించారు. 400 మంది డ్వాక్రా మహిళలకు ఇ-సైకిళ్లు సీఎం చేతుల మీదుగా పంపిణీ చేశారు. కాగా కుప్పం నియోజకవర్గంలో ఇప్పటికే రూ. 42.5 కోట్ల వ్యయంతో 46 కిలోమీటర్ల మేర సీసీ రహదారులు, 65 కిలోమీటర్ల బీటీ రోడ్లు పూర్తి అయ్యాయి. తాగునీటి సరఫరా నిమిత్తం రూ.8.97 కోట్లతో పనులు పూర్తి చేశారు. గోకులం షెడ్లు రూ.7.63, వీధిదీపాలు రూ.3.7 కోట్లు, రూ.1.64 కోట్లతో పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణం పూర్తి అయింది. కార్యక్రమంలో ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు.